Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు నెలల్లో కూలిన సామ్రాజ్యం
- 10 లక్షల కోట్ల సంపద ఆవిరి
న్యూఢిల్లీ: అమెరికన్ సంస్థ హిండెన్‌బర్గ్ రిపోర్ట్ దెబ్బకు భారత అపార కుబేరుడు, మోడీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న గౌతం అదానీ వ్యాపార సామ్రాజ్యం కకావికలం అయ్యింది. భవిష్యత్తు ప్రణాళికలు మరుగున పడ్డాయి. అదానీ గ్రూపు తీవ్ర ఆర్థిక అవకతవకలు, కార్పొరేట్ ఎకౌంటింగ్ మోసాలకు పాల్పడుతుందని జనవరి 24న హిండెన్‌బర్గ్ ఇచ్చిన రిపోర్ట్‌తో ఆ సంస్థ కంపెనీల మార్కెట్ విలువ దాదాపు రూ.10 లక్షల కోట్లు (125 బిలియన్ డాలర్లు) తుడుచుకు పెట్టుకుపోయిందని బ్లూమ్‌బర్గ్ తాజాగా ఓ రిపోర్ట్‌లో పేర్కొంది. మరోవైపు అదానీ గ్రూపు అనేక లక్ష్యాలు, ఆశయాలు దెబ్బతిన్నాయని తెలిపింది. కొత్త రంగాలకు విస్తరించే ప్రణాళికలు నిలిచి పోయాయి. ఇప్పటికే భారీ అప్పుల ఊబిలో ఉన్న అదానీ గ్రూపు నిధుల సమీకరణలో మరింత ప్రతికూలతను ఎదుర్కొంటుంది. పెట్రోకెమికల్స్ వ్యాపారాల నుంచి వెనక్కి తగ్గుతోందని, పశ్చిమ భారతదేశంలోని ముంద్రా లో 4 బిలియన్ డాలర్ల గ్రీన్‌ఫీల్డ్ కోల్ టు పాలీ వినైల్ క్లోరైడ్ ప్రాజెక్టుపై ముందుకు వెళ్లే అవకాశం లేదని ఈ వ్యవహారంతో దగ్గర సంబంధం ఉన్న వారు పేర్కొన్నట్లు బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. అదే విధంగా అల్యూమిని యం, స్టీల్, రోడ్ ప్రాజెక్ట్‌లలోకి ముందుకు వెళ్లాలనే ఆశయాలను వెనక్కి తీసుకుందని సమాచారం. ప్రస్తుతమున్న విద్యుత్ ఉత్పత్తి, నౌకాశ్రయాలు, గ్రీన్ ఎనర్జీ రంగాలపై మాత్రమే దృష్టి సారించే అవకాశం ఉంది. ఇటీవల దొడ్డిదారిన ఎన్‌డిటివిని స్వాధీనం చేసుకున్న అదానీ.. ఇకపై మీడియా సంస్థలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపకపోవచ్చని తెలుస్తోంది. ''హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌తో తీవ్ర స్థాయిలో నష్టపోయిన విశ్వాసాన్ని తిరిగి పొందడానికి అదానీ ప్రయత్నించవచ్చు. ఇతర వాటాదారులు, పెట్టుబడి దారుల ఆందోళనపై ప్రధానంగా దృష్టి పెట్టవచ్చు.'' అని వాషింగ్టన్ ఆధారిత విల్సన్ సెంటర్లోని సౌత్ ఆసియా ఇన్స్ట్యూట్ డైరెక్టర్ మైఖెల్ కుగెల్మాన్ పేర్కొన్నారు.