Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2023-24లో 6.3 శాతమే: ప్రపంచ బ్యాంక్ అంచనా
న్యూఢిల్లీ : భారత వృద్థి రేటు అంచనాలకు ప్రపంచ బ్యాంక్ కోత పెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023- 24)లో 6.3 శాతం మాత్రమే వృద్థి ఉండొచ్చని విశ్లేషించింది. ఇంతక్రితం ఈ అంచనా 6.6 శాతంగా వేసింది. ప్రయివేటు వినిమయంలో పతనం, అంతర్జాతీయ ప్రతి కూల పరిణామాలు జిడిపి మందగించడానికి ప్రధాన కారణాలని ప్రపంచ బ్యాంక్ విశ్లేషించింది. రుణాలపై వడ్డీ రేట్లు పెరగడం, ఆదాయాల్లో పెరుగుదల మందగించడం, ప్రయివేటు వినిమయం పడిపోవడం తదితర అంశాలు వృద్థి రేటును ప్రధానంగా ఒత్తిడికి గురి చేస్తున్నాయని తెలిపింది. అదే విధంగా కరోనా కాలంలో ప్రకటించిన ఆర్థిక మద్దతును క్రమంగా ఉపసంహరించుకోవడం, ప్రభుత్వ వ్యయాల్లోను పెద్ద పెరుగుదల లేకపోవడం వృద్థిని మందగించేలా చేస్తున్నాయని పేర్కొంది.2024-26 మధ్య 7 శాతం సగటు వృద్థి ఉండొచ్చని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. అమెరికా, యూరప్‌లోని ఇటీవలి ప్రతికూల పరిణామాలు భారత్ లాంటి వర్థమాన దేశాలపై పడుతుందని పేర్కొంది. భారత బ్యాంక్‌ల వద్ద సరిపడ మూలధనం ఉందని తెలిపింది. గడిచిన ఆర్థిక సంవత్సరం అక్టోబర్ నుంచి డిసెంబర్ త్రైమాసికంలో 4.4 శాతం వృద్థి చోటు చేసుకుంది. మార్చి త్రైమాసికంలో 6.3 శాతంగా నమోద య్యింది. ద్రవ్యోల్బణం 5.2 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతం వృద్థి ఉండొచ్చని ఆర్థిక సర్వే పేర్కొనగా.. 6.4 శాతం నమోదు కావొచ్చని ఆర్బిఐ అంచనా వేసింది. 6 శాతమే ఉండొచ్చని ఎస్అండ్పి గ్లోబల్ రేటింగ్ సంస్థ విశ్లేషిం చింది. 2023- 24లో భారత వృద్థి 6.4 శాతంగా ఉండొచ్చని ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మంగళవారం ఓ రిపోర్టులో అంచనా వేసింది. 2023 మార్చితో ముగిసిన ఏడాదిలో ఇది 6.8 శాతంగా నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపింది. వచ్చే 2024-25లో 6.7 శాతం పెరగొచ్చని అంచనా వేసింది.