Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగ్గురిపై సీబీఐ దాఖలు
ముంబయి: ఐసీఐసీఐ బ్యాంక్ - వీడియోకాన్ క్విడ్ ప్రోకో కుంభ కోణంలో సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ చందాకొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్ సహా వీడియోకాన్ వ్యవ స్థాపకులు వేణుగోపాల్ దూత్‌లపై ముంబయి సివిల్ సెషన్స్ కోర్టులో సీబీఐ శనివారం చార్జిషీట్ దాఖలు చేసింది. ఐపీసీ సెక్షన్ 120-బి, 409, అవినీతి కేసులను నమోదు చేసింది. నిబంధనలకు విరుద్దంగా వీడియోకాన్‌కు రూ.3,250 కోట్ల అప్పులిచ్చి.. తన భర్త కంపెనీకి మేలు జరిగేలా చందా కొచ్చర్ వ్యవహరించిన విషయం తెలిసిందే. 2009, 2011 మధ్య వీడియోకాన్ గ్రూపునకు చెందిన ఆరు కంపెనీలకు రూ.1,875 కోట్ల టర్మ్ రుణాన్ని మంజూరు చేయడంలో అవకతవకలు జరిగాయని సీబీఐ విచారణలో తేలింది. క్విడ్ ప్రోకో క్రింద వీడియోకాన్ గ్రూపునకు రుణాలు మంజూరైనట్టు గుర్తించింది. ఇందులో ధూత్ ప్రధాన లబ్ధిదారుడిగా ఉన్నారు. ఇందుకుగాను దీపక్ కొచ్చర్‌కు చెందిన నూపవర్ రెన్యూవబుల్స్ లిమిటెడ్‌కు రూ.64 కోట్లు, దక్షిణ ముంబయిలోని ఫ్లాట్‌కు 2016లో రూ. 5.25 కోట్లు లంచంగా ముట్టాయని సీబీఐ ప్రధాన ఆరోపణ. ఈ క్విడ్‌ప్రోకో కేసుపై 2019లో తొలిసారి ఎఫ్ఐఆర్ నమో దైంది. 2022 డిసెంబర్లో కొచ్చర్ దంపతులను, వేణుగోపాల్ ధూత్‌లను సీబీఐ అరెస్టు చేసింది. జనవరి రెండో వారంలో ఆ ముగ్గురికి బెయిల్ లభించింది. ఈ కేసు వల్ల చందా కొచ్చర్ ఉద్యోగం ఊడటంతో పాటుగా ఆమె అప్పటి వరకు సంపాదించుకున్న ప్రతిష్ట ఒక్కసారి గంగలో కలిసి పోయింది. ప్రయివేటు బ్యాంకులపై నమ్మకం సన్నగిల్లేలా చేశారని తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు.