Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్న రాజ కుటుంబీకులు
- డబ్ల్యూటీఐటీసీ అధ్యక్షులు సందీప్ మఖ్తల ఆహ్వానం మేరకు రాక
- ఒమన్‌లో టెక్నాలజీ రంగం అభివృద్ధిపై సలహాల స్వీకరణ
- ఒమన్, డబ్ల్యూటీఐటీసీ మధ్య ఒప్పందం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
చమురు ఉత్పత్తుల్లో అగ్రగామిగా ఉన్న దేశాల్లో ఒకటైన ఒమన్ దేశ యువరాజు హిస్ హైనెస్ అల సయ్యిద్ ఫైరస్ ఫాతిక్ మే నెలలో తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి (డబ్ల్యూటీఐటీసీ ) అధ్యక్షులు సందీప్ కుమార్ మఖ్తల ఆహ్వానం మేరకు ఆయన ఇక్కడకు రానున్నారు. ఒమన్ పర్యటనలో భాగంగా సందీప్ నిర్వహించిన సమావేశంలో ఒమన్ డబ్ల్యూటీఐటీసీ ప్యాటర్న్ సభ్యునిగా ఉండేందుకు ఫైరస్ ఫాతిక్ అంగీకారం తెలపడంతో మంగళవారం ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఒమన్‌లో ఐటీ, ఐటీ అనుబంధ రంగాల అభివృద్ధికి పలు సలహాలు స్వీకరించిన యువరాజు ఈ మేరకు కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సందీప్‌కు తెలిపారు. ఒమన్, తెలుగు రాష్ట్రాల మధ్య విద్యార్థుల ఎక్సేంజ్ ప్రోగ్రాం నిర్వహణకు సైతం ఓకే చెప్పారు.
ఇంధనం వెలికితీత వంటి అంశాల్లో ఎదిగినప్పటికీ సాంకేతికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్న ఒమన్ ఈ మేరకు కృషి చేస్తే కలిగే అవకాశాలను ఈ సందర్భంగా సందీప్ వెల్లడించారు. ఏఐ, మెషిన్ లెర్నింగ్ వంటి అంశాల ప్రాధాన్యతను గురించి వివరించారు. ఒమన్‌లోని విద్యార్థులు, యువతకు టెక్నాలజీలో శిక్షణ అందించేందుకు తమ ప్రత్యేకతలను తెలిపారు. ఫరాజ్ టెక్నాలజీలో ఒమన్- డబ్ల్యూటీఐటీసీ కలిసి చేసేందుకు త్వరలో ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్టు వెల్లడించారు. రిట్జ్ గ్రూప్ అధినేత ఎంఎన్ఆర్ గుప్త, ఎస్ఎస్ఆర్ క్లౌడ్ అధినేత శశిధర్ శర్మ, డబ్ల్యూటీఐటీసీ సభ్యులు కరీం షేక్, హేమంత్ సర్వబొట్ల, అభిషేక్ రెడ్డి అర్రబోలు ఒమన్ పర్యటన బృందంలో ఉన్నారు.