Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫార్చూన్ గ్రూప్ ఫౌండర్ శ్రీనివాస్ రెడ్డి వెల్లడి
హైదరాబాద్: పెయింట్స్ తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ టెక్నో పెయింట్స్ మరో మూడు ప్లాంట్లు ఏర్పాటు చేయను న్నట్టు ప్రకటించింది. విశాఖపట్నం, చిత్తూరుతోపాటు మధ్యప్రదేశ్‌లోని కట్నీ వద్ద వీటిని నెలకొలపనున్నట్లు వెల్లడించింది. ఈ కేంద్రాల్లో డ్రై సిమెంట్ పుట్టీ, టెక్స్చర్స్, ప్రైమర్స్, ఎమల్షన్స్ తయారు చేయనుంది. కొత్త ప్లాంట్లను ఈ ఏడాది ముగింపు నాటికే అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకుంది. తొలి దశలో ఒక్కొక్క ప్లాంటు వార్షిక సామర్థ్యం 30,000 మెట్రిక్ టన్నులు ఉంటుందని టెక్నో పెయింట్స్‌ను ప్రమోట్ చేస్తున్న ఫార్చూన్ గ్రూప్ ఫౌండర్ ఆకూరి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం రూ.46 కోట్లు వెచ్చిస్తున్నట్టు పేర్కొన్నారు. కావాల్సిన నిధులను సమకూర్చేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం ఈ కంపెనీకి తెలంగాణలో మూడు, ఆంధ్రప్రదేశ్‌లో ఒక ప్లాంటు ఉంది. వార్షిక సామర్థ్యం 2,50,000 మెట్రిక్ టన్నులుగా ఉంది.
తెలంగాణ నుంచి భారీ ప్రాజెక్టు..
తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇటీవలే మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి కార్యక్రమంలో భాగంగా 26,065 పాఠశాలలకు రంగులు వేసే ప్రతిష్టాత్మక ప్రాజెక్టును టెక్నో పెయింట్స్ చేపట్టింది. ''ఇప్పటికే 2,000 పైచిలుకు పాఠశాలలకు పెయింట్స్ పని పూర్తయ్యింది. 2001లో ప్రారంభమైన టెక్నో పెయింట్స్ ఇప్పటి వరకు 960కిపైగా కార్పొరేట్ ప్రాజెక్టులను పూర్తి చేసింది. వీటిలో ప్రభుత్వ రంగ ప్రాజెక్టులు సైతం ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో 80కి పైగా ప్రాజెక్టులు పూర్తి అయ్యాయి. ప్రస్తుతం 138 ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయి. 250 మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 4,000 మంది పెయింటర్లు కంపెనీ ప్రాజెక్టుల్లో పని చేస్తున్నారు.'' అని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.