Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధిక ధరల ప్రభావం
- అక్షయ తృతీయ అమ్మకాల్లో పతనమే..!
- 10 గ్రాముల ధర రూ.60,550
హైదరాబాద్: బంగారం ధర రికార్డ్ స్థాయిలో పెరగడంతో డిమాండ్ పై ప్రతికూల ప్రభావం పడుతోంది. 10 గ్రాముల పసిడి ధర రూ.60 వేలు దాటిన నేప థ్యంలో సామాన్యులు కొనలేక పోతున్నారు. హెచ్చు ధరలతో ఈ ఏడాది అక్షయ తృతీయ అమ్మకాలు తగ్గొచ్చని బులియన్ వర్గాలు, వ్యాపారు లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి అమ్మకాలు కనీసం 20 శాతం పడిపోవచ్చని ఆభరణాల వర్తకులు అభిప్రాయపడుతున్నారు. ఏప్రిల్ 22న అక్షయ తృతీయ రోజున రిటైలర్లకు నిరాశనే ఎదురుకానుందని భావిస్తు న్నారు. గతేడాదితో పోల్చితే 20-30 శాతం అమ్మకాలు తగ్గొచ్చని ఆ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2022 అక్టోబర్‌లో రూ.50,600గా ఉన్న బంగారం ధర తాజాగా రూ.61వేల చేరువలో ఉంది. శుక్రవారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారంపై రూ.430 తగ్గి రూ.60,550గా పలికిందని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ తెలిపింది. కిలో వెండి ధర రూ.670 తగ్గి రూ.75,080గా నమోదయ్యింది.
''ఇటీవల 10 గ్రాముల బంగారం ధర రూ.60,000 దాటింది. దీంతో పసిడి కొనుగోళ్ల విషయంలో వినియోగదారులు అచీతూచీ వ్యవహ రిస్తున్నారు. ఈ పరిస్థితి అక్షయ తృతీయ అమ్మకాలను ప్రభావితం చేయ నుంది. ఈ దఫా అమ్మకాల్లో 20 శాతం మేర తగ్గుదల చోటు చేసుకోవచ్చు. అధిక ద్రవ్యోల్బణం ప్రజల కొనుగోలు శక్తిని దెబ్బతీస్తుంది. దీంతో బంగారం, వజ్రాల లాంటి అనవసర కొనుగోళ్లకు దూరంగా ఉంటున్నారు.'' అని మెటల్ ఫోకస్ కన్సల్టెంట్ చిరాగ్ సేత్ పేర్కొన్నారు.
ఈ దఫా అక్షయ తృతీయ అమ్మకాలపై అధిక ధరల ప్రభావం ఉండొచ్చని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యువెల్లరీ కౌన్సిల్ (జిజెసి) ఛైర్మన్ శ్యామ్ మెహ్రా విశ్లేషించారు. ఇదే తరహా అభిప్రాయాన్ని చెన్నరులోని ఎన్ఎసి జ్యువెల్లర్స్ ఎండి అనంత పద్మనాభన్ వ్యక్తం చేశారు. బంగారం ధరల్లో ఈ ఆకస్మిక పెరుగుదల ప్రభావం ఇప్పటికే మార్కెట్లో కనిపిస్తుందన్నారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది అక్షయ తతీయ రోజున అమ్మకాల విలువ 10 శాతం, డిమాండ్ 20 శాతం క్షీణించవచ్చన్నారు. ఇప్పటి వరకు ఏ అక్షయ తృతీయ రోజున కూడా ఈ స్థాయిలో బంగారం ధరలు లేవని వాల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యుజిసి) ఇండియా సిఇఒ సోమ సుందరం పిఆర్ అన్నారు. ఈ సమయంలో కనీసం పెళ్లిళ్లు లేకపోవడం కూడా డిమాండ్‌ను ప్రభావితం చేస్తోందని ఇండియన్ బులియన్ అండ్ జ్యువెల్లర్స్ నేషనల్ సెక్రటరీ సురేంద్ర మెహాతా పేర్కొన్నారు. అధిక పసిడి ధరల వల్ల స్టోర్లకు రావడానికి జనాలు వెనకాడుతున్నారని తెలిపారు.