Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎలాంటి అవకతవకలు లేవు
- పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ వివరణ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఔటర్ రింగ్ రోడ్డు నిర్వహణను ప్రయివేటు సంస్థకు అప్పగించడంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ స్పష్టం చేశారు. బుధవారంనాడిక్కడి ఎమ్ఏయూడీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 158 కి.మీ., 8 దారుల విస్తీర్ణంతో వృత్తాకారంలో ఉన్న ఈ రహదారి 2006లో ప్రారంభమై 2018లో పూర్తి అయ్యిందని తెలిపారు. దీనిపై టోల్‌చార్జీలను జాతీయ రహదారుల సంస్థ నిర్ణయిస్తుందన్నారు. కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖ నిర్థారించిన టోల్-ఆపరేట్-ట్రాన్స్ఫర్ (టీఓటీ) పద్ధతిలో దీన్ని 30 ఏండ్లకు లీజుకు ఇవ్వాలని 2022 ఆగస్టు 11న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదించిందని వివరించారు. దాని ప్రకారమే ఫ్రాన్స్‌కు చెందిన కన్సల్టెంట్ సంస్థను మధ్యవర్తిగా ఏర్పాటు చేసి అంతర్జాతీయ బిడ్స్‌ను ఆహ్వానించామన్నారు. దీనిలో నాలుగు సంస్థలు అర్హతపొందాయనీ, దానిలో ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్ సంస్థ రూ.7,380 కోట్లకు అధిక బిడ్ కోడ్ చేసిందని చెప్పారు. నిబంధనల ప్రకారమే 2023 ఏప్రిల్ 27న ఆ సంస్థకు ఓఆర్ఆర్ను అప్పగించినట్టు తెలిపారు. ఈ బిడ్డింగ్ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా కేంద్ర ప్రభుత్వ విధివిధానాలను అనుసరించే జరిగాయని ఆయన స్పష్టం చేశారు.