Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పిటిషన్ స్వీకరించిన ఎన్‌సిఎల్‌టి
- ఛార్జీలు పెంచే పనిలో ఇతర సంస్థలు
ముంబయి : చౌక ధరల విమానయాన సంస్థ గో ఫస్ట్ దివాలా పిటిషన్‌ను గురువారం నాడు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌టి) విచారించనుంది. వాడియా గ్రూప్ యాజమాన్యంలోని ఆ సంస్థ నిధుల కొరత వల్ల మే 3, 4 తేదిల్లో విమానాలను రద్దు చేసుకుంది. స్వచ్ఛంద దివాలా పరిష్కార ప్రక్రియకు దరఖాస్తు చేసినట్లు ఆ కంపెనీ సిఇఒ మంగళవారం తెలిపారు. తక్షణ పరిష్కార చర్యల్లో భాగంగా ఏప్రిల్ 4న ముంబయి ఎన్‌సిఎల్‌టి బెంచ్ ఈ కేసును విచారించనుంది. దివాలా ప్రక్రియ ద్వారా గో ఫస్ట్‌కు పునర్జీవం పోయాలని భావిస్తున్నామని ఆ కంపెనీ సిఇఒ ఖోనా వెల్లడించారు. గో ఫస్ట్ విమాన సంస్థకు 55 విమానాలు ఉన్నాయి. భారత విమానయాన మార్కెట్లో దాదాపు 7 శాతం వాటా కలిగి ఉంది. కాగా.. అమెరికాకు చెందిన ప్రాట్ అండ్ విట్నీ (పిడబ్ల్యు) సంస్థ సకాలంలో ఇంజిన్లను సరఫరా చేయకపోవడం వల్లే ఆర్థిక సంక్షోభ ఇబ్బంది పరిస్థితులు నెలకొన్నాయని గో ఫస్ట్ ప్రధానంగా ఆరోపించింది. ఇంజిన్ల సమస్యలతో గో ఫస్ట్ సంస్థ 57 విమానాల్లో 28 కార్యకలాపాలను నిలిపివేయాల్సి వచ్చిందని.. దీంతో ఆర్థిక పరిస్థితులు మరింత గడ్డుగా మారాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఆరోపణలను పిడబ్ల్యు సంస్థ ఖండించింది. తమ వినియోగదారులకు డెలివరీ షెడ్యూల్ల విషయంలో ప్రాధాన్యతనిస్తూనే ఉన్నామని పేర్కొంది. గో ఫస్ట్ విమానాల రద్దుతో ఇతర విమానయాన కంపెనీలు తమ సర్వీసులను పెంచుకునే పనిలో పడ్డాయి. కొత్తగా 25 విమానాలను పునరుద్దరించుకునేందుకు రూ.400 కోట్లు సమీకరించామని స్పైస్‌జెట్ వెల్లడించింది.
చార్జీలు పెరగొచ్చు
విద్యార్థులకు వేసవి సెలవులు కావడంతో పర్యాటక రంగం పుంజుకుంటుంది. మరోవైపు గో ఫస్ట్ విమానాల రద్దుతో రద్దీ పెరిగింది. వేసవి షెడ్యూల్లో భాగంగా మార్చి 26 నుంచి అక్టోబర్ 28 మధ్య గో ఫస్ట్ వారానికి 1538 విమాన సర్వీసులు నడపాల్సి ఉంది. ఇవి రద్దు కావడంతో ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి ఇతర విమానయాన కంపెనీలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో చార్జీలు పెంచితే ప్రయాణికులపై మరింత భారం పడనుంది.