Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న శరద్ పవార్
ముంబయి : నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) జాతీయ అధ్యక్షులుగా రాజీనామా చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని శరద్ పవార్ శుక్రవారం వెనక్కి తీసుకున్నారు. పార్టీ కార్యకర్తల నుంచి వచ్చిన తీవ్రమైన స్పందన కారణంగానే రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు శరద్ పవార్ తెలిపారు. ' నా నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని పార్టీ సభ్యులతో సహా కార్యకర్తలు, శ్రేయోభిలాషులు కోరారు. మీ మనోభావాలను నేను ఆగౌరవ పర్చలేను. నాపై మీరు చూపిన ఆప్యాయత, విశ్వాసం నన్ను ముంచెత్తింది. కమిటీ నిర్ణయాన్ని గౌరవిస్తూ, నా రాజీనామాను వెనక్కి తీసుకుంటున్నాను' అని పార్టీ క్యాడర్‌ను ఉద్దేశించి శరద్ పవార్ తెలిపారు.
కాగా, అంతకు ముందు శుక్రవారం ఉదయం ముందుగా జరిగిన ఎస్సిపి కమిటీ సమావేశం శరద్ పవార్ రాజీనామాను ఏకగ్రీవంగా తిరస్కరించింది. పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగాలని శరద్ పవార్‌ను కోరాలని కూడా నిర్ణయం తీసుకుంది. ముంబయిలోని ఎన్‌సిపి ప్రధాన కార్యాయలంతో ఈ కమిటీ సమావేశం 30 నిమిషాలకు పైగా కొనసాగింది. సమావేశం అనంతరం మీడియాతో పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు ప్రఫుల్ పటేల్ మాట్లాడుతూ ' ఎస్సిపి జాతీయ అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలన్న శరద్ పవార్ నిర్ణయాన్ని కమిటీ ఏకగ్రీవంగా తిరస్కరిస్తూ ప్రతిపాదనను ఆమోదించింది. ఎన్‌సిపికి పవార్ మూలస్తంభం. ఈ పదవిలో ఆయన శాశ్వతంగా ఉండాలన్నదే మా కోరిక' అని చెప్పారు.అనంతరం కమిటీ నిర్ణయాన్ని శరద్ పవార్ 'సిల్వర్ ఓక్' నివాసంలో పవార్‌కు పటేల్, అజిత్ పవార్, జయంత్ పాటిల్, సుప్రియా సూలే తదితర పార్టీ సీనియర్ నాయకులు తెలియ చేశారు.