Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నికర వడ్డీ ఆదాయంలో 38 శాతం వృద్థి
న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ ఇండియా (బిఒఐ) 2023 మార్చితో ముగిసిన త్రైమాసికం లో 123 శాతం వృద్థితో రూ. 1,350 కోట్ల నికర లాభాలు సాధించింది. ఈ ప్రభుత్వ రంగ సంస్థ గతేడాది ఇదే సమయంలో రూ.606 కోట్ల లాభాలు నమోదు చేసింది. గడిచిన త్రైమాసికంలో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 37.77 శాతం పెరిగి రూ.5,493 కోట్లకు చేరింది. 2022-23కు గాను ప్రతీ రూ.10 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేర్‌పై రూ.2 డివిడెండ్‌ను అందించడానికి బోర్డు ఆఫ్ డైరెక్టర్లు ఆమోదం తెలిపారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ రుణాల జారీ 12.87 శాతం పెరిగి రూ.5.15 లక్షల కోట్లకు చేరాయి. మొత్తం డిపాజిట్లు 6.64 శాతం వృద్థితో రూ.6.69 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు ఏడాదికేడాదితో పోల్చితే 9.98 శాతం నుంచి 7.31 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పిఎలు 2.34 శాతం నుంచి 1.66 శాతానికి దిగివచ్చాయి. 2022-23లో మొత్తంగా 18.15 శాతం వృద్థితో రూ. 4,023 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇంతక్రితం 2021-22లో రూ. 3,405 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో నికర వడ్డీపై ఆదాయం రూ.14,063 కోట్లుగా ఉండగా.. గడిచిన 2022- 23లో 44.17 శాతం పెరుగుదలతో రూ.20,275 కోట్లకు చేరింది. వడ్డీ యేతర ఆదాయం రూ.7,100 కోట్లుగా చోటు చేసుకుంది. ఆ బ్యాంక్ గ్లోబల్ బిజి నెస్ 9.27 శాతం వృద్థితో రూ.10,84,910 కోట్లుగా ఉంది. వ్యవసాయ రుణాలు 8.99 శాతం పెరిగి రూ.72,391 కోట్లుగా, ఎస్ఎంఎంఇ అడ్వాన్సులు 9.31 శాతం వృద్థితో రూ.70,777 కోట్లుగా, రిటైల్ క్రెడిట్ 17.40 శాతం పెరిగి రూ.94,716 కోట్లు చొప్పున నమోదయ్యాయి.