Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరాయి దేశంలో కొలువుపై భారతీయుల్లో తగ్గుతోన్న ఆసక్తి
- అంతర్జాతీయ రాజకీయ అనిశ్చితే కారణం
- అమెరికాలో ఉపాధిపై 38% తగ్గిన మోజు
- బ్రెగ్జిట్ నేపథ్యంలో బ్రిటన్పైనా అనాసక్తతే!
- గల్ఫ్ బాటపైనా 21% మేర కుంగిన ఆసక్తి
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: విదేశీ ఉద్యోగాల పట్ల భారతీయుల్లో క్రమంగా ఆసక్తి తగ్గుతూ వస్తోందని ఒక సర్వేలో తేలింది. అంతర్జాతీయంగా విదేశాల్లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి కారణంగా అత్యంత నైపుణ్యం కలిగిన.. ప్రతిభావంతులైన వారు స్వదేశంలోనే ఉండిపోయి, ఇక్కడే ఉపాధి అవకాశాలను వెతుక్కొనేందుకు ఆసక్తి చూపుతున్నారని అంతర్జాతీయ జాబ్సైట్ ఇన్డీడ్ ఒక సర్వేలో వెల్లడించింది. గత ఏడాది కాలంలో భారత్ నుంచి ఉపాధి కోసం అమెరికాకు వెళ్లాలనుకొనే వారి సంఖ్యలో 38 శాతం, బ్రిటన్కు వెళ్లాలను కొనే వారి సంఖ్యలో 42 శాతం మేర క్షీణత కనిపించినట్టుగా సర్వే తెలిపింది. బ్రెగ్జిట్ నేపథ్యం కారణంగా బ్రిటన్లో కొలువులు కోరుకునే వారి సంఖ్య తగ్గిందని ఇన్డీడ్ అభిప్రాయపడింది. ఇదే సమయంలో ఐరోపా దేశాలైన జర్మనీ, ఐర్లాండ్ల వైపు భారతీయులు ఎక్కువగా ఉపాధి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సర్వే వెల్లడించింది. దీంతో ఉద్యోగాల కోసం జర్మనీకి వెళ్లాలనుకొనే వారి సంఖ్యలో 10%, ఐర్లాండుకు పోవాలనుకొనే వారి సంఖ్యలో 20 శాతం మేర వృద్ధి నమోదు అయిందని సర్వే తెలిపింది. ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఉపాధికోసం గల్ఫ్ బాట పట్టాలనుకొనే వారి సంఖ్యలో కూడా 21 శాతం మేర క్షీణత నమోదైందని ఇన్డీడ్ విశ్లేషించింది. ఇదే నేపథ్యంలో స్వదేశానికి తిరిగి రావాలనుకొంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్నట్టుగా ఇన్డీడ్ తెలిపింది. బ్రిటన్లో ఉంటూ భారత్లో ఉద్యోగ వేట సాగిస్తున్న వారి సంఖ్యలో 25%, ఆసియా పసిఫిక్ ప్రాంతం నుంచి భారత్కు రావాలని చూస్తున్న వారి సంఖ్యలో 170 శాతం మేర వృద్ధి నమోదు అయినట్టుగా ఇన్డీడ్ వివరించింది. భారత్ ఉపాధి అవకాశాలతో పాటు ఈజ్ఆఫ్ డూయింగ్తో ఉపాధి అవకాశాలు మెరుగు పడుతుండంతో ఎక్కువ మంది నిపుణులు భారత్లోనే తమకు మెరుగైన ఉపాధిని లభిస్తుందన్న భావనలో ఉన్నారని తెలిపింది. దీంతో వారు స్వదేశం వైపు ఎక్కువగా దృష్టి సారిస్తున్నట్టుగా ఈ సర్వే తెల్చింది.
...అయినా అమెరికానే టాప్ ఛాయిస్!
ఉపాధి కోసం అగ్రరాజ్యం అమెరికాకు వెళ్లాలనుకొనే వారి సంఖ్య గణనీయంగా పడిపోయినప్పటికీ.. ఇంకా 49 శాతం మంది ఔత్సాహిక భారతీయులు అమెరికాలో ఉద్యోగ అవకాశాల కోసం అన్వేషణ కొనసాగించేందుకే ఇష్ట పడుతున్నట్టు సర్వే వివరించింది. దీనికి తోడు ఉపాధి కోసం భారతీయులు ఎక్కువగా ఇష్ట పడుతున్న ఇతర దేశాలలో యూఏఈ (16%), కెనెడా (9%), గ్రేట్ బ్రిటన్ (5%), సింగపూర్ (4%), ఆస్ట్రేలియా (3%), కతార్ (2%), దక్షిణాఫ్రికా (1%), బెహరైన్ (1%) ఉన్నట్టుగా సర్వే తెలిపింది.