Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో అమెజాన్ అధినేతదే అగ్రస్థానం
- జెఫ్ సంపద అక్షరాల రూ.9.70 లక్షల కోట్లు
- రెండోస్థానానికి పరిమితమైన బిల్గేట్స్
- 19వ స్థానంలో రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ
- 100 మేటి సంపన్నుల్లో నలుగురు భారతీయులకు చోటు
శాన్ఫ్రాన్సిస్కో: ప్రపంచంలోనే అపర కుబేరుడిగా అమెజాన్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ జెఫ్ బెజోస్ మళ్లీ రికార్డుకెక్కారు. ఫోర్బ్స్ మేగజైన్ తాజాగా విడుదల చేసిన బిలియనీర్ల జాబితాలో ఆయన తన అగ్రస్థానాన్ని నిలుపుకున్నారు. దాదాపు 141.9 బిలియన్ డాలర్ల (రూ.9,69,673 కోట్లకుపైగా) సంపదతో బెజోస్ అపర కుబేరుడిగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. గతేడాది కూడా ఆయనే బిలియనీర్ జాబితాలో తొలి స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. బెజోస్ తర్వాత స్థానంలో 92.9 బిలియన్ డాలర్ల (రూ.6,34,321 కోట్లకు పైగా) సంపదతో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సంపన్నుడిగా నిలిచారని జిన్హువా న్యూస్ ఏజెన్సీ రిపోర్టు చేసింది.. 82.2బిలియన్ డాలర్ల (రూ.5,61,261 కోట్లకు పైగా) సంపదతో వారెన్ బఫెట్ ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో మూడో స్థానంలో ఉన్నారని తెలిపింది. ఫోర్బ్స్ విడుదల చేసిన బిలియనీర్ల జాబితాలో 100లోపు ర్యాంకింగ్లను కలిగి ఉన్న సంపన్నులలో భారత్ నుంచి కేవలం నలుగురికి మాత్రమే స్థానం లభించడం విశేషం. దాదాపు 40.1 బిలియన్ డాలర్ల (రూ.2,73,121 కోట్లకు పైగా) సంపదతో ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ సంస్థల అధినేత ముఖేశ్ అంబానీ ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో 19వ స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో విప్రో అధినేత అజీమ్ ప్రేమ్జీ 18.8 బిలియన్ డాలర్ల (రూ.1,28,366 కోట్లకు పైగా) సంపదతో 58వ స్థానంలో ఉన్నారు. ప్రవాస భారతీయుడు లక్ష్మీ మిట్టల్ 18.5 బిలియన్ డాలర్ల (రూ.1,26,318 కోట్లకు పైగా) సంపదతో జాబితాలో 62వ స్థానంలో ఉన్నారు. హెచ్సీఎల్ అధినేత శివ నాడర్ దాదాపు 14.6బిలియన్ డాలర్ల (రూ.99,688 కోట్లకు పైగా) సంపదతో ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో98వ స్థానంలో నిలిచారు.