Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెట్ మూసివేతతో తీవ్ర ఆందోళనలో సిబ్బంది
- జీర్ణించుకోలేకపోతున్న ఉద్యోగులు..
- కుటుంబాలతో సహా ప్రదర్శనలు..
- ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి..
- స్టాఫ్ ఆకర్షణ దిశగా ప్రత్యర్థి సంస్థల ఎత్తుగడలు
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రయివేటు విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ తన సేవలను నిలిపివేయడంతో ఆ సంస్థలో పని చేస్తున్న దాదాపు 22000 మందికి పైగా ఉద్యోగులు రోడ్డున పడ్డారు. రుణదాతల నుంచి మధ్యంతర సాహాయం అందుతందని.. తమ సంస్థ మళ్లీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తుందని బుధవారం వరకు ఆశగా ఉన్న ఉద్యోగులంతా.. హఠాత్తుగా సంస్థ మూసివేత నిర్ణయంతో ఒక్కసారి ఆందోళనలో మునిగిపోయారు. ఆర్థిక సంక్షోభం కారణంగా బుధ వారం రాత్రి నుంచి జెట్ తాత్కాలికంగా సేవలను నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో తమను ఆదుకోవాలంటూ సంస్థ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఢిల్లీ లోని జంతర్‌మంతర్ వద్ద ముంబయిలోనూ శాంతి యుత నిరసనలను చేపట్టారు. ప్రభుత్వం తగిన చొరవచూపి జెట్ ఎయిర్వేస్ తిరిగి ఎగిరేలా చర్యలు చేపట్టాలని వారు కోరారు.
ఎక్కువ మంది సీనియర్లే..
దేశీయ విమానయాన రంగంలో రారాజుగా వెలుగొంది.. ఆర్థిక దన్ను లేక నేలకు వాలిన జెట్ ఎయిర్వేస్ సంస్థలో అత్యధిక మంది ఉద్యోగులు సీని యర్లే ఉన్నారు. నైపుణ్యత, పాక్షిక నైపుణ్యత కలిగిన చాలా ఉద్యోగాల్లో జెట్ ప్రారంభం నుంచి పని చేస్తున్న స్టాఫ్ అంతా దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఆదే సంస్థను నమ్ముకొని పని చేస్తున్నారు. జెట్ ఎయిర్వేస్ సంస్థ దినదినప్రవర్థమానకంగా ఎదగ డంతో వీరు.. ఆదే సంస్థలో గత కొన్నేండ్లుగా పని చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు హఠాత్తుగా సంస్థ మూత పడడంతో వీరు పరిస్థితి అగమ్యగోచరంగా తయా రైంది. సంస్థ నుంచి తమకు గత మూడు నెలలకు పైగా జీతాలు రావాల్సి ఉందని.. అయినా జెట్ ఎయిర్వేస్ మళ్లీ పుంజుకొని రన్‌వే ఎక్కుతుందన్న ఆశతో తాము భారంగా బతుకు బండి లాగుతు న్నామని.. ఇప్పుడు సంస్థను మూసివేశారన్న వార్తను అసలు జీర్ణించుకోలేకపోతున్నట్టుగా చెబుతూ సంస్థకు చెందిన గ్రౌండ్ వర్క్ సిబ్బంది సిదార్థజైన్ కన్నీరుమున్నీరయ్యారు. వయస్సు పెరిగిపోవడంతో ఇప్పుట్లో తాము వేరే సంస్థలో చేరి ఉద్యోగం కూడా చేయలేని పరిస్థితి అని ఆయన తెలిపారు. మరోవైపు రీమా అనే క్రూ సిబ్బంది మాట్లాడుతూ..' దయచేసి మా కుటుంబాలను కాపాడండి. మా ఉద్యోగ ప్రభా వం మా పిల్లల మీద పడుతోంది. ఇప్పుడు మేం రోడ్డున పడాల్సి వచ్చింది. నాలుగు నెలలుగా మాకు జీతాల్లేవు. పిల్లల చదువులు, ట్యూషన్ ఫీజులు కట్ట డానికి మా దగ్గర డబ్బుల్లేవు' అని వాపోయారు. భోజా పూజారి అనే ఉద్యోగి మాట్లాడుతూ..'26 ఏండ్లుగా ఇదే సంస్థను నమ్ముకుని ఉన్నాను. ఈ సంస్థను స్థాపించినప్పుడు నేను ఇందులో చేరాను. ఇన్నేళ్లలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ తలెత్తలేదు. రెండు రోజులుగా నిద్రే లేదు. నేను మా పిల్లలకు ఈ విషయాలన్నీ చెప్పలేదు. ఎందుకంటే వాళ్లు చాలా చిన్న పిల్లలు. కొన్ని రోజుల తర్వాత వారికి తిండి పెట్టడం కూడా కష్టమవుతుందేమోనని భయంగా ఉంది' అంటూ బోరున విలపించారు.
తక్కువ జీతంతో పోటీ సంస్థల ఆఫర్లు..
జెట్ ఎయిర్వేస్ ఇబ్బందుల్లోకి జారుకోని ఆ సంస్థ సిబ్బందికి జీతాలు కూడా లభించని పరిస్థితిని పోటీ సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయి. జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాల్లో కీలక భూమిక పోషించిన ప్రధాన ఉద్యోగులకు ప్రత్యర్థి సంస్థలు బంపర్ ఆఫర్‌ను ఎరవేస్తూ ఆకర్షిస్తున్నాయి. కాగా మరోవైపు ఇతర టెక్నికల్ సిబ్బందికి కూడా ప్రత్యర్థి విమానయాన సంస్థలు ఆఫర్లు ఇస్తున్నప్పటికీ చాలా తక్కువ జీతాన్ని ఇస్తామని చెబుతున్నాయి. ఎలాగో జీతాలు లేక కష్టాల్లో ఉన్న వారిని తమ సంస్థలోకి తక్కువ జీతానికి చేర్చుకొని పని చేయించుకొని నిర్వహణ లాభాల్ని పెంచుకొనేలా ఆయా సంస్థలు వ్యూహాలను అమలు చేస్తున్నాయి.