Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పవన్ కళ్యాణ్, శ్రీరామ్ వేణు కాంబినేషన్లో రూపొందిన చిత్రం 'వకీల్ సాబ్'. బోనీకపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, బే వ్యూ ప్రాజెక్ట్స్ పతాకాలపై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు శ్రీరామ్ వేణు బుధవారం మీడియాతో సంభాషించారు. ఆ విశేషాలు..
- లాక్డౌన్ కారణంగా థియేటర్ సెలబ్రేషన్స్‌కి, ఆడియెన్స్‌కి దూరంగా ఉన్నాం. మొన్న థియేటర్లో 'వకీల్ సాబ్' ట్రైలర్ రిలీజ్ సందర్భంగా లోపలికి వెళ్లేందుకు ఓ పావుగంట, బయటకి రావడానికి ఓ పావు గంట టైం పట్టింది. అంత పెద్ద సంఖ్యలో ట్రైలర్ రిలీజ్‌కి ఫ్యాన్స్ వచ్చారు. పవర్‌స్టార్ సినిమా కోసం వాళ్లు ఎంతగా వేచి చూస్తున్నారో అప్పుడు అర్థమైంది.
- పవన్ గారితో పనిచేయాలి అనేది నా డ్రీమ్. అభిమాన హీరోని డెరెక్ట్ చేయడం కంటే కావాల్సింది ఏముంటుంది?. మేకింగ్ టైమ్‌లో ఎక్కడా ఒత్తిడికి గురి కాలేదు. చిత్రీకరణ సమయంలో ప్రతి రోజూ ఎంజారు చేశా. పవన్‌ని చూడగానే హ్యాపీగా ఫీలవుతా. ఈ సినిమా చాలా బాగుంటుందనే పూర్తి నమ్మకంతో ఉన్నా.
- ఈ ప్రాజెక్ట్ సెట్ అయినప్పుడు పవన్‌ని కలిశాను. ఆయన నాతో మాట్లాడుతూ, 'పింక్' రీమేక్‌ను ఎలా చేద్దామనుకుంటున్నారు?, మీ ఆలోచనలు ఏంటి?, ఈ కథను మీరు ఎలా తెరకెక్కించాలని ఆలోచిస్తున్నారు అని అడిగారు. ఆయన ప్రశ్నలకు సమాధానాల కోసం రెండు మూడు మీటింగ్స్ జరిగాయి. కథ, స్క్రీన్ ప్లే, క్యారెక్టర్ గురించి నేను అనుకున్న విషయాలను ఆయనతో చెప్పాను. ఆయన కూడా కొన్ని ఇన్‌ఫుట్స్ ఇచ్చారు.
- హిందీ 'పింక్' ఒకలా ఉంటుంది. తమిళ 'పింక్' మరోలా ఉంటుంది. పవన్ గారు అంటే ఏంటో ఒక అభిమానిగా, దర్శకుడిగా నాకు తెలుసు. కాబట్టి ఆయనకు సరిపోయేలా సబ్జెక్ట్ మార్చి చేశాను. అలాగే ఒక స్టార్ హీరో సినిమా చేస్తున్నప్పుడు ఆయన ఇమేజ్, ట్రేడ్, బిజినెస్..ఇలా అన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు కళ్యాణ్ గారికి వేర్వేరు రకాల ఆడియెన్స్ ఉంటారు. ఎ, బి, సి అనే కేటగిరీలు ఉంటాయి. వాళ్లందరికీ చేరేలా ఈ సినిమాని రూపొందించాను. 'లాయర్ సాబ్', 'మగువా లోకానికి తెలుసా నీ విలువ' లాంటి కొన్ని టైటిల్స్ అనుకున్నాం. కానీ పవర్ స్టార్ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేయటం ఇష్టం లేక 'వకీల్ సాబ్' అని పెట్టాం.
- ఈ సినిమాలో నటించిన ముగ్గురమ్మాయిల్లో ఒక క్యారెక్టర్ ఇన్నోసెంట్‌గా ఉండాలి. ఆ క్యారెక్టర్‌కి అనన్యని తీసుకున్నాను. కాన్ఫిడెన్స్ ఉన్న మరో అమ్మాయి పాత్రకు అంజలిని తీసుకున్నాం. ప్రస్తుత కల్చర్‌ని రిప్రజెంట్ చేసే మోడరన్ క్యారెక్టర్‌కి నివేదాను సెలెక్ట్ చేశాం. ఈ ముగ్గురూ తమ క్యారెక్టర్స్‌ని చక్కగా చేశారు.
- 'బద్రి' సినిమాని గుర్తు చేయడానికే ప్రకాష్ రాజ్ గారి పాత్రకు నందా అని పెట్టాను. అలాగే పవన్ కళ్యాణ్ గారితో ఓ స్పెషల్ ప్రమోషనల్ సాంగ్ ఉంటుంది. అది ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది సంగీత దర్శకుడు తమన్ రివీల్ చేస్తారు. పవర్‌స్టార్‌కి ఉన్న స్టేచర్‌కి ఉమెన్ ఎంపవర్మెంట్ కంటే మంచి కాన్సెప్ట్ ఉండదు. ఆయనకు ప్రస్తుతం బాధ్యత గల ఇలాంటి సినిమా చాలా కరెక్ట్. ఈ సినిమా తీసుకొచ్చే ఎలాంటి రికార్డ్స్ గురించి నేను ఆలోచించడం లేదు. మనం ఎమోషన్‌తో కనెక్ట్ అయితే ఆ సినిమా ఎప్పటికీ గుర్తుంటుంది. మాయాబజార్, బొమ్మరిల్లు లాంటి సినిమాలను మనం అంకెలతో గుర్తుపెట్టకోలేదు కదా (నవ్వుతూ).
- ఫ్రెండ్స్ కథతో 'ఓ మై ఫ్రెండ్', వదిన మరిది కాన్సెప్ట్‌తో చేసిన 'ఎంసీఏ'.. ఈ రెండు సినిమాలు ఈ సినిమా చేయడానికి బాగా ఉపయోగపడ్డాయి. నా ఫస్ట్ సినిమా 'ఓ మై ఫ్రైండ్' రిలీజై ఈ నవంబర్‌కు సరిగ్గా పదేళ్లు పూర్తవుతాయి. నాకు సినిమాలంటే ఇష్టం. హిట్స్, ఫ్లాప్స్ ఏది వచ్చినా ఇక్కడే ఉండాలని నిశ్చయించుకున్నా. నెక్ట్ సినిమా గురించి ఇంకా స్పష్టత లేదు. త్వరలో వివరాలను చెప్తాను.