Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ సమ్మర్ సీజన్‌ని క్యాష్ చేసుకోవాలని ఆశించిన నిర్మాతలకు నిరాశే ఎదురవ్వడం బాధాకరం. సమ్మర్ అంటే మేకర్స్‌కి కలెక్షన్ల వర్షం కురిపించే సీజన్. ఎంత పోటీ ఉన్నప్పటికీ ఈ సీజన్లో తమ సినిమాలను విడుదల చేసేందుకు మేకర్స్ పక్కా ప్లాన్‌తో ఉంటారు. ఆ ప్లాన్‌కి అనుగుణంగా విపరీతమైన ప్రమోషన్లతోనూ హడావుడి చేసి, పబ్లిక్ని థియేటర్ వరకు రప్పించడానికి చేసే ప్రయత్నాల్లోనూ సఫలం అవుతున్నారు.అయితే వచ్చిన చిక్కల్లా ఇక్కడే... మండే ఎండల్ని సైతం లెక్క చేయక థియేటర్‌కి వచ్చిన ప్రేక్షకులకు మాత్రం సినిమాలు చిర్రెత్తిస్తున్నాయి. దీంతో బాగా ఆడుతుంది.. పక్కా బ్లాక్‌బస్టర్ అంటూ హీరోలు, దర్శక, నిర్మాతలు ప్రమోషన్లలో చెప్పిన మాటలు కేవలం మాటలుగానే మిగిలిపోతున్నాయి.
దీనికి ఈనెలలో విడుదలైన సమ్మర్ సినిమాలే ప్రత్యక్ష సాక్ష్యాలు.'ఆర్ఆర్ఆర్'లోని 'నాటు' పాటకు ప్రతిష్టాత్మక ఆస్కార్ వచ్చిన దగ్గర్నుంచి మన తెలుగు సినిమా వైపు యావత్ సినీ ప్రపంచం చూస్తోంది. జాతీయంగా, అంతర్జాతీయంగా తెలుగు సినిమా రెప రెపలాడుతున్న ఇటువంటి తరుణంలో మన దగ్గర వస్తున్న సినిమాలు బాగుండాలి లేదా కనీసం ఫర్వాలేదనిపించుకోవాలి. అంతేకానీ.. వామ్మో ఏంటీ ఈ సినిమాలనిపించుకుంటే ఎలా?, దీని వల్ల నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు.. వీళ్ళే కాదు సినిమాని నమ్ముకున్న అందరూ రోడ్డున పడటం ఖాయం. కంటెంట్ ఉన్న కథల మీద కాకుండా కాంబినేషన్ల మాయలో పడి సినిమాలు తీస్తే ఫలితాలు ఎలా ఉంటాయో రీసెంట్గా విడుదలైన 'రామబాణం', 'ఉగం', 'కస్టడీ' తదితర చిత్రాలు చెప్పకనే చెప్పాయి. కనీసం ఇప్పటికైనా నిర్మాతలు కేవలం క్యాషియర్లుగా ఉండకుండా గతంలో మాదిరిగా కమాండ్ ఉన్న నిర్మాతల్లా వ్యవహరించి సరైన కథలను ఎంపిక చేసుకోవాలి.
గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్లో 'లక్ష్యం', 'లౌక్యం' రెండు సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాల్ని సాధించాయి. మళ్ళీ ఇదే కాంబినేషన్లో 'రామబాణం' రూపొంది, ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆల్రెడీ హిట్ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలతో థియేటర్‌కి వచ్చిన ప్రేక్షకులను ఈ సినిమా ఏ మాత్రం మెప్పించలేక పోయింది. దీంతో గురి తప్పిన రామబాణంగా నిర్మాతకి ఆర్థికంగా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. గతంలో అల్లరినరేష్, విజరు కనకమేడల కాంబినేషన్లో 'నాంది' సినిమా విడుదలై మంచి విజయం సాధించింది. ఇదే కాంబినేషన్లో 'ఉగ్రం' తెరకెక్కడంతో సహజంగానే అంచనాలు పెరిగాయి. అయితే ఈ సినిమా విషయంలోనూ బిగ్గెస్ట్ మైనస్ కథే కావడం గమనార్హం. ఇక శుక్రవారం అక్కినేని నాగచైతన్య 'కస్టడీ' సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రేక్షకుల ముందుకొచ్చారు. 'మానాడు', 'గోవ', 'సరోజ' వంటి భిన్న చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు. ఈయన సినిమా అంటే కచ్చితంగా బాగుంటుందని మన తెలుగు ప్రేక్షకులు సైతం ఫిక్సయ్యారు. అయితే దీనికి భిన్నంగా అత్యంత పేలవమైన కథతో నాగచైతన్య, వెంకట్‌ప్రభు కాంబినేషన్ అందర్నీ నిరాశపర్చింది. ఈ మూడు సినిమాల విషయంలో జరిగింది ఒక్కటే.. కథ మీద కంటే కాంబినేషన్ మీదే మేకర్స్ ఫోకస్ చేశారు. దీంతో ఆకట్టుకోవాల్సిన కాంబినేషన్లు ప్చ్.. అని ప్రేక్షకుల్ని పెదవి విరిచేలా చేశాయి.
పై సినిమాల మాదిరిగానే గతంలో పూరీజగన్నాథ్, విజరు దేవయ్కొండ కాంబినేషన్లో 'లైగర్' సినిమా వచ్చింది.ఇది ప్రేక్షకుల నిరాదరణతో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది.దీంతో ఈ సినిమాని తీసుకున్న ఎగ్జిబిటర్లు భారీగా నష్టపోయారు. తమకు రావాల్సిన డబ్బుని దర్శక, నిర్మాత పూరీజగన్నాథ్ ఇస్తానని చెప్పి 6 నెలలైనా ఇవ్వకపోవడంతో శుక్రవారం ఫిల్మ్‌ఛాంబర్ ముందు రిలే నిరాహార దీక్షకు దిగారు. వీళ్ళ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా మేకర్స్ స్పృహతో సినిమాలు తీయకపోతే భారీగా నష్టపోవడం ఖాయం.