Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'గబ్బర్ సింగ్' బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తయింది. అలాగే మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలయ్యాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్‌ని విడుదల చేసి అభిమానుల్లో ఉత్సాహం నింపారు మేకర్స్. అంతేకాకుండా 'గబ్బర్ సింగ్' సెంటిమెంట్‌ని పాటిస్తూ, ఆ సినిమా విడుదలైన తేదీ మే 11కే ఈ చిత్ర ఫస్ట్ గ్లింప్స్‌ని విడుదల కావడం మరింత ప్రత్యేకంగా నిలిచింది. గురువారం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్లో ఫస్ట్ గ్లింప్స్ విడుదల వేడుక ఘనంగా జరిగింది. 'ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో, అధర్మము వృద్ధి నొందునో, ఆయా సమయములయందు ప్రతి యుగమునా అవతారము దాల్చుచున్నాను' అంటూ ఘంటసాల చెబుతున్న భగవద్గీతలోని శ్లోకంతో గ్లింప్స్ ప్రారంభమైంది. ''భగత్.. భగత్ సింగ్.. మహంకాళి పోలీస్ స్టేషన్, పాతబస్తీ'' అంటూ ఖాకీ చొక్కా, గళ్ళ లుంగీ, నుదుటున తిలకంతో జీపులోనుంచి దూకుతూ ఎంట్రీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. కేవలం 40 సెకన్ల వీడియోలోనే తన మ్యానరిజమ్స్, యాటిట్యూడ్, ఆవేశంతో గూజ్ బంప్స్ తెప్పించారు. చివరల్లో 'ఈసారి పర్ఫామెన్స్ బద్దలైపోయిద్ది' అంటూ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో ముందే చెప్పేశారు. ఇక దేవి శ్రీ ప్రసాద్ అందించిన నేపథ్య సంగీతం గ్లింప్స్‌ని మరోస్థాయికి తీసుకెళ్లింది అని మేకర్స్ తెలిపారు. అభిమానుల సమక్షంలో పండుగలా జరిగిన ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ వీరాభిమాని సతీష్ కోట చేతుల మీదుగా గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ''గబ్బర్ సింగ్' మన పదేళ్ల ఆకలి తీరిస్తే.. గబ్బర్ సింగ్ నుంచి భగత్ సింగ్ వరకు ఇది నా 11 ఏళ్ళ ఆకలి. ఈ క్షణం కోసం 11 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాను. అందుకే ఈ ఎగ్జైట్మెంట్ని ఫ్యాన్స్‌తో పంచుకోవాలని, మీ సమక్షంలో గ్లింప్స్‌ని విడుదల చేశాం' అన్నారు.