Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ పల్లె కథతో వస్తున్న సినిమా 'తురుమ్ ఖాన్లు'. స్టార్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై శివకళ్యాణ్ దర్శకత్వంలో ఎండీ.ఆసిఫ్ జానీ నిర్మిస్తున్న ఈ చిత్రం శంషాబాద్‌లో జరిగిన ఆఖరి షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తి చేసుకుంది. పల్లెటూరు రివెంజ్ కామెడీ జోనర్లో మొదటిసారి మహబూబ్ నగర్ స్లాంగ్‌లో తెరకెక్కు తున్న ఈ చిత్రంలో దాదాపు 90 శాతం కొత్త నటీనటులే కావడం విశేషం. ఈ సందర్భంగా దర్శకుడు శివకళ్యాణ్ మాట్లాడుతూ, 'దర్శకుడిగా ఇది నాకు మొదటి సినిమా. నన్ను, నా కథని నమ్మిన నిర్మాత ఆసిఫ్ జానీకి థ్యాంక్స్. ఈ ఆధునిక యుగంలో బ్రహ్మ, విష్ణు, ఈశ్వర్ అనే ముగ్గురు యువకులు ఒకే ఊరిలో పుట్టి, పెరిగి, సరదాగా ఒకరినొకరు ఎలా ఆటపట్టించుకుంటారు?, ఒకర్ని ఒకరు ఎలా ఏడిపించుకుంటారు అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రమిది' అని అన్నారు. 'బలమైన కథ, సహజమైన పాత్రలు ఉన్న ఈ చిత్రాన్ని క్వాలిటీగా రూపొందించడానికి ఎక్కడా, ఏ మాత్రం కాంప్రమైజ్ కాలేదు. సినిమా అనుకున్న దానికంటే బాగా వచ్చింది. త్వరలోనే భారీ ఎత్తున థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నాం' అని నిర్మాత ఆసిఫ్ జానీ చెప్పారు.