Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నా కెరీర్లో ఇప్పటివరకు 40 మంది కొత్త దర్శకులతో పని చేశా. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి వాళ్ల కొత్త ఆలోచనలే కారణం' అని కథానాయకుడు నాగార్జున చెప్పారు.
ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం 'వైల్డ్‌డాగ్'. అషిషోర్ సాల్మన్ దర్శకత్వంలో మ్నాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన చిత్రమిది. ఈ చిత్రం ఈనెల 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా నాగార్జున బుధవారం మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
- 2019లో 'బంగార్రాజు' స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నప్పుడు ఈ స్క్రిప్ట్‌ని దర్శకుడు సాల్మన్ నాకు నెరేట్ చేశారు. కథ వినగానే నాకెంతో నచ్చింది. అన్నింటికి మించి ఇలాంటి కథని డెఫినెట్‌గా ప్రేక్షకులకు చెప్పాలనిపించింది. సెకండ్ థాట్ లేకుండా ఈ సినిమా చేయడానికి గ్రీన్‌సిగల్ ఇచ్చా.
- 2000 సంవత్సరం నుంచి 2017 వరకు మన జంటనగరాలతోపాటు దేశంలో ఎన్నో చోట్ల టెర్రరిస్టులు చేసిన బాంబు దాడులు యావత్ దేశాన్ని కుదిపేశాయి. ఆ కుట్రదారుల్ని పట్టుకోవడానికి రంగంలోకి దిగిన ఎన్ఐఏ బృందం ఏం చేసిందనే విషయాల గురించి దర్శకుడు చెబుతున్నప్పుడు చాలా షాకింగ్‌గా అనిపించింది. కథలో భాగంగా ఈ విషయాలను దర్శకుడు స్క్రీన్ మీద చెప్పే తీరు ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.
- ఇక ఈ సినిమాలో నేను ఎన్ఐఏ ఆఫీసర్ విజరువర్మగా నటించా. ఎవరి మాటా వినడు. తాను కరెక్ట్ అని నమ్మితే ఎంత వరకైనా వెళ్తాడు. నేపాల్‌లో ఓ సాధారణ యునాని డాక్టర్‌గా చెలామణి అవుతున్న బాంబు దాడుల సూత్రధారిని నా నేతృత్వంలో నా టీమ్ ఎలా మట్టుపెట్టిందనేది ఆద్యంతం ఆసక్తికరం.
- ఈ సినిమా టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత ఈ ఏజ్‌లోనూ అన్ని యాక్షన్ సీక్వెన్స్‌ల్ని ఎలా చేశారంటూ అందరూ ఫోన్లు చేసి అడుగుతున్నారు. ఇవి చేయటానికి ఒకే ఒక కారణం నేనెప్పుడూ ఫిట్‌గా ఉండటమే.
- ఈ సినిమాలో పాటలు, డాన్సులు లేవు. అయినా ఎందుకు అంగీకరించారని కూడా చాలా మంది అడిగారు. ఈ రోజుల్లో ప్రేక్షకులు సినిమాలు చూసే తీరు మారింది. వాళ్లు కూడా బలవంతంగా పెట్టిన పాటల్ని చూడ్డానికి ఇష్టపడటం లేదు. నేను నటించిన 'గగనం' సినిమాలోనూ పాటలు లేవు. అంతేకాదు ఇలాంటి సినిమాలకు లేడీస్ రారు అనే కామెంట్స్‌ని నేను ఖండిస్తున్నా. ఎందుకంటే 'శివ' సినిమా చేసినప్పుడు కూడా లేడీస్ రారు అని చెప్పారు. అది ట్రెండ్‌సెట్టర్ అయ్యింది. అందుకే రిలీజ్ వరకు ఏ సినిమా ఎలా అడుతుందనే విషయాన్ని చెప్పలేం. రెగ్యులర్ సినిమాలు, రెగ్యులర్ పాత్రలంటే నాకు చాలా బోర్. అందుకే కొత్త దర్శకులతో, కొత్త కాన్సెప్ట్‌లతో, కొత్త ప్రయోగాలతో సినిమాలు చేస్తుంటాను. నా కెరీర్లో ఇప్పటివరకు 40 మంది కొత్త దర్శకులతో చేశా. వాళ్ళల్లోని కొత్త ఆలోచనల ఫలితమే నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం.
- బాలీవుడ్ సినిమా 'బ్రహ్మాస్త్ర' చాలా బాగా వచ్చింది. ఇందులో 30 నిమిషాల పాటు నేను కనిపిస్తాను. చాలా మంచి రోల్ చేశా. అలాగే 'బంగార్రాజు' పూర్తి వినోదభరిత చిత్రం. 2013 సంక్రాంతికి దీన్ని రిలీజ్ చేస్తాం. అలాగే కొన్ని వెబ్‌సిరీస్‌లు చర్చల దశలో ఉన్నాయి. కంటెంట్ వైజ్‌గా అంతర్జాతీయంగా మరింత స్పాన్ పెరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఓటీటీల కోసం కూడా కొన్ని అనుకుంటున్నాం.