Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పవన్ కళ్యాణ్, శ్రీరామ్ వేణు కాంబినేషన్లో రూపొందిన చిత్రం 'వకీల్ సాబ్'. బోనీకపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, బే వ్యూ ప్రాజెక్ట్స్ పతాకాలపై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించిన అంజలి గురువారం మీడియాతో ముచ్చటించారు. 'దర్శకుడు శ్రీరామ్ వేణు ఈ సినిమా గురించి చెప్పిన కాన్సెప్ట్‌లు బాగా నచ్చాయి. పవర్‌స్టార్‌తో సినిమా అనగానే జంప్ చేశాను. అయితే నా క్యారెక్టర్ ఎలా ఉంటుందో అని ఆలోచించా. ఎందుకంటే పెద్ద హీరోతో పని చేస్తున్నప్పుడు మన క్యారెక్టర్స్ కొట్టుకుపోతాయి. కానీ ఈ సినిమాలోని నా క్యారెక్టర్‌కి ఒక స్థానం ఉంటుంది. సినిమా ఇండిస్టీలో నాయికలకు కొన్ని చేదు సందర్భాలు ఎదురవుతుంటాయి. అయితే ఇక్కడ సెలబ్రిటీ, సాఫ్ట్వేర్ ఎంప్లారు అని కాదు అమ్మాయి అమ్మాయే. ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంటుంది. అవును డబ్బులు తీసుకున్నాం అని. ఆ ఒక్క సీన్ చాలు నా క్యారెక్టర్ ఎంత బలంగా ఉంటుందని చెప్పటానికి. ఈ సీన్ మరో రోజు చేయాల్సింది. కానీ ఆ రోజు సడెన్‌గా చేశాం. ఈ కోర్ట్ సీన్ చేశాక, నేను వణికిపోయాను.అంత ఉద్వేగానికి గురయ్యాను. ఈ సీన్ చేశాక పవన్ గారు క్లాప్స్ కొట్టి, నన్ను అప్లాజ్ చేశారు. ఆయన ప్రశంసించడం చాలా హ్యాపీగా అనిపించింది. నేను గతంలో కొన్ని గుర్తుండిపోయే క్యారెక్టర్స్ చేశాను. వాటిల్లో 'వకీల్ సాబ్' క్యారెక్టర్ తప్పకుండా ఉంటుంది. ఈ సినిమాతో ప్రకాష్ రాజ్‌తో మరోసారి పనిచేసే అవకాశం వచ్చింది. అలాగే ఇందులో నాకూ, నివేదా, అనన్యకు మధ్య చాలా సీన్స్ ఉంటాయి. మా మధ్య రిలేషన్ లేకుంటే క్యారెక్టరైజేషన్స్ సరిగ్గా రావు. మా మధ్య చాలా తక్కువ టైమ్‌లో మంచి బాండింగ్ ఏర్పడింది. దీంతో నటించేప్పుడు చాలా ఈజీ అయ్యింది. మహిళల మీద జరిగే అఘాయిత్యాలు మనకు నిత్యకత్యం అయ్యాయి. ఆ వార్తలు మనకు కామన్ అయి పోయాయి. మన ఇంట్లో ఇలాంటిది జరిగితే ఎలా రెస్పాండ్ అవుతామనేది ఈ సినిమాలో చూపిస్తున్నాం. ఇలాంటి సందర్భాలు ఏ అమ్మాయికీ రాకూడదు. ప్రస్తుతం తెలుగు, తమిళంలో కొన్ని ఆసక్తికర చిత్రాలు చేస్తున్నాను. త్వరలోనే వాటి వివరాలు తెలియజేస్తాను' అని అంజలి అన్నారు.