Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇప్పుడున్న ట్రెండ్‌లో ఓ సినిమాలోని పాట బాగా సక్సెస్ అయితే ఆటోమేటిగ్గా ఆ సినిమాని చూసేందుకు ప్రేక్షకులు చాలా చాలా ఆసక్తి చూపిస్తున్నారు. తెలుగునాట సంగీతానికి, పాటలకు ఉన్న ప్రాధాన్యత అలాంటిది. ఇటీవల బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న చాలా సినిమాల ఆడియోలు కూడా విశేష ప్రేక్షకాదరణ పొందాయి. అంతేకాదు సినిమాల సక్సెస్‌లో కీలక పాత్ర పోషించాయి. ప్రముఖ ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన 'ఉప్పెన' సినిమాలోని అన్ని పాటల్ని ప్రేక్షకులు విశేషంగా ఆదరించారు. ఇదే ఆల్బమ్‌లో ఉన్న 'నీ కళ్లు నీలి సముద్రం' పాటకు 204 మిలియన్ల వ్యూస్ రావడం విశేషం. అలాగే అల్లు అర్జున్ నటించిన ఇండిస్టీ హిట్ సినిమా 'అల వైకుంఠపురము' లోని 'బుట్టు బొమ్మ..' పాటకు 575 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇదే ఆల్బమ్‌లో ఉన్న 'సామజ వరగమన' పాట 173 మిలియన్లు, 'రాములో రాముల' పాట 353 మిలియన్ వ్యూస్ అందు కున్నాయి. అలాగే విజయ్ దేవరకొండ నటించిన 'గీతగోవిందం' ఆడియో 100 మిలియన్స్ వ్యూస్ దక్కించుకుంది. తాజాగా వీటి సరసన 'సారంగదరియా..' పాట చేరింది. సుద్దాల అశోక్‌తేజ సాహిత్యం, మంగ్లీ గాత్రం, పవన్.సి.హెచ్ సమకూర్చిన బాణీలు అందరినీ ఫిదా చేస్తున్నాయి.
శేేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి నటిస్తున్న చిత్రం 'లవ్ స్టోరీ'. ఈ చిత్ర ఆడియోలో ఉన్న 'సారంగ దరియా' పాట ఆదిత్య మ్యూజిక్ యూ ట్యూబ్ ఛానల్ ద్వారా విడుదలైన అతి కొద్ది సమయంలోనే ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన అందుకోవడం ఓ విశేషమైతే, అతి తక్కువ రోజుల్లో 101 మిలియన్ల వ్యూస్‌తో ఆదిత్య మ్యూజిక్ వారి 100 మిలియన్ వ్యూస్ క్లబ్లో చేరడం విశేషం. గతంలో వరుణ్ తేజ్, సాయిపల్లవి, శేఖర్ కమ్ముల కాంబోలో వచ్చిన 'ఫిదా' ఆడియోలోని 'వచ్చిండే పాట..' కూడా ఆదిత్య మ్యూజిక్ వారి 100 మిలియన్ వ్యూస్ క్లబ్లో చోటు దక్కించుకుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ పతాకాలపై కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్రావు సంయుక్తంగా నిర్మించిన 'లవ్‌స్టోరీ' చిత్రం ఈనెల 16న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.