Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తాన్య దేశాయ్, అంకిత్ రాజ్, కావ్య రెడ్డి, వినోద్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'స్ట్రీట్ లైట్'. మూవీ మాక్స్ బ్యానర్ పై విశ్వ దర్శకత్వంలో మామిడాల శ్రీనివాస్ నిర్మించారు. ఈ చిత్ర లిరికల్ వీడియో సాంగ్‌తో పాటు టీజర్ లాంచ్ బుధవారం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన దర్శకుడు జి. నాగేశ్వర రెడ్డి లిరికల్ వీడియో సాంగ్‌ని విడుదల చేయగా, ట్రైలర్‌ని నిర్మాత సి.కళ్యాణ్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ, 'సాంగ్ చూసాం.చాలా బాగుంది. నిర్మాత శ్రీనివాస్ మంచి థాట్స్‌తో ఈ సినిమా తీశారు. కానీ సెన్సార్ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను మించిపోయారు అని చెప్పాలి. అయన ఆలోచనలు ఆ రేంజ్లో ఉన్నాయి. ఈ సినిమాలో మసాలా ఎక్కువగా ఉంది' అని అన్నారు. చిత్ర దర్శకుడు విశ్వ మాట్లాడుతూ, 'ఇదొక మెసేజ్ ఇచ్చే సినిమా. పగలంతా ఎంతో పెద్దమనుషులుగా చలామణి అయ్యే చాలా మంది ఆలోచనలు రాత్రి అయ్యేసరికి క్రిమినల్ థాట్స్, సెక్సువల్ పర్వర్షన్ ఎలా మారతాయి అనే నేపథ్యంలో ఈ సినిమా తీసాం. చీకట్లో జరిగే ముఖ్యంగా స్ట్రీట్ లైట్ కింద జరిగే సంఘటనలతో ఈ సినిమా తెరకెక్కించాం. ఏ విధంగా తమ క్రైమ్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూ, అమాయకుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారో, అందులో ఒక యువతికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడాన్ని ఆద్యంతం సస్పెన్స్‌గా తీర్చిదిద్దాం' అని చెప్పారు.
'తెలుగు, హిందీ రెండు భాషల్లో ఈ సినిమాని తీసాం. ఇప్పటికే బిజినెస్ పరంగా కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తాన్యా దేశాయ్ అద్భుతంగా చేసింది' అని నిర్మాత మామిడాల శ్రీనివాస్ తెలిపారు. హీరోయిన్ తాన్యా దేశాయ్ మాట్లాడుతూ, 'లిరికల్ వీడియో చాలా బాగుంది. తప్పకుండా ఈ సినిమా అందర్నీ మెప్పిస్తుంది' అని చెప్పారు.