Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మంజునాథ్, తనిష్క్ జంటగా రూపొందిన చిత్రం 'మా ఊరి ప్రేమకథ'. శ్రీ మల్లికార్జున స్వామి క్రియేషన్స్ పతాకంపై యస్వీ మంజునాథ్ స్వీయ దర్శకత్వంలో నిర్మితమైన చిత్రమిది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 22న విడుదల కానుంది. గురువారం ఫిల్మ్ ఛాంబర్లో జరిగిన కార్యక్రమంలో ఈ చిత్ర ట్రైలర్‌ను కె.ఎల్ దామోదర ప్రసాద్ రిలీజ్ చేయగా, చిత్రంలోని ఒక్కో పాటను ఒక్కో అతిథి ఆవిష్కరించారు. కీ మ్యూజిక్ ద్వారా ఈ చిత్ర ఆడియో విడుదలైంది. ఈ సందర్భంగా హీరో, నిర్మాత, దర్శకుడు మంజునాథ్ మాట్లాడుతూ,'ఎన్ని కష్టాలు ఎదురైనా, వాటిని లెక్కచేయకుండా ఈ సినిమా తెరకెక్కించాను. దానికి మా ఫ్యామిలీ ఎంతో సపోర్ట్ చేసి, ఎంకరేజ్ చేసింది. అలాగే ఈ సినిమా విషయంలో నాకు అండగా ఉండి ఎంతో సహకరిస్తున్న రామసత్యనారాయణ, సంధ్య స్టూడియో రవికి నా థ్యాంక్స్. విలేజ్ నేపథ్యంలో జరిగే యాక్షన్, లవ్ ఎంటర్టైనర్ ఇది. సెన్సార్ కార్యక్రమాలు అన్నీ పూర్తయ్యాయి. సినిమా చూసిన వారంతా మంచి సినిమా తీశారని అభినందించారు. ఈనెల 22న ఈ చిత్రాన్ని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తున్నాం' అని అన్నారు. సంగీత దర్శకుడు జయసూర్య మాట్లాడుతూ,'బ్యూటిఫుల్ లవ్ స్టొరీ ఇది. సందర్భానికి తగ్గట్లుగా పాటలు రాసి, మ్యూజిక్ చేశాను. మంజునాథ్ ఒక మంచి చిత్రాన్ని చేశాడు' అని తెలిపారు.
'కీ మ్యూజిక్ ద్వారా 22 సినిమాల ఆడియోని రిలీజ్ చేశాం. ఈ చిత్రంలోని పాటలు అద్భుతంగా ఉన్నాయి. విజువల్‌గా కాంప్రమైజ్ కాకుండా చిత్రీకరించారు. ఈ సినిమా మంచి విజయం సాధించి, మంజునాథ్‌కి పేరుతోపాటు డబ్బులూ రావాలి' అని కీ మ్యూజిక్ అధినేత రవి కనగాల చెప్పారు.