Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా ఫస్ట్ వేవ్‌తో భారీ నష్టాన్ని చవిచూసిన తెలుగు సినిమా ఇప్పుడిప్పుడే ఊపిరి పోసుకుంటోంది. ప్రేక్షకులు సైతం కరోనా భయాన్ని వీడి థియేటర్లకి వస్తుండటంతో దర్శక, నిర్మాతల్లో కొండంత ధైర్యం వచ్చింది. అయితే తెలుగు సినిమాకి పూర్వ వైభవం వచ్చిందనే
ఆనందాన్ని సెకండ్ వేవ్ ఆవిరి చేసింది. అలాగే పరిశ్రమపై ఆధారపడిన
ప్రతి ఒక్కరినీ ఒణికిపోయేలా చేస్తోంది.
శుక్రవారం విడుదలైన పవన్‌కళ్యాణ్ 'వకీల్‌సాబ్' విశేష ప్రేక్షకాదరణతో ఘన విజయం వైపు పయనిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అలాగే ఓవర్సీస్ నుంచి ఈ సినిమాకి వస్తున్న కలెక్షన్లు అందర్నీ ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే, కరోనా వల్ల ప్రాభవాన్ని కోల్పోయిన తెలుగు సినిమాకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చింది. అభిమాన నటుడి సినిమాని చూడాలన్న అభిమానుల బలమైన ఆకాంక్ష ముందు కరోనా సెకండ్ వేవ్ భయం కూడా మాయమైపోయింది. ప్రేక్షకులు మునుపటిలా థియేటర్లకి వస్తున్నారనే దర్శక, నిర్మాతల ఆనందాన్ని విస్తృతంగా పెరుగుతున్న కరోనా కేసులు నీరుగార్చాయి. అంతేకాదు దీని ధాటికి వాయిదాల పర్వం మొదలవ్వడం బాధాకరం.
'సీటీమార్'తో ఆరంభం
కరోనా సెకండ్ వేవ్ ప్రభావాన్ని ముందుగానే గ్రహించిన 'సీటీమార్' బృందం ఈ చిత్ర విడుదలని వాయిదా వేసింది. దీంతో ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమాని ఈనెల 30కి వాయిదా వేశారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈనెల 30న ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు దాదాపు లేనట్టే అని చెప్పక తప్పదు.
గోపీచంద్, తమన్నా జంటగా సంపత్‌నంది దర్శకత్వంలో రూపొందిన క్రీడా నేపథ్య చిత్రమిది. అలాగే నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం 'లవ్‌స్టోరీ'. శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలోని 'సారంగ దరియా..' పాట విశేష ఆదరణ పొంది యూ ట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌ని రాబట్టింది. ఈ చిత్రాన్ని కూడా ఈనెల 16న విడుదల చేయాల్సి ఉంది. ప్రేక్షకుల సేఫ్టీ దృష్ట్యా ఈ చిత్ర రిలీజ్‌ని వాయిదా వేస్తున్నట్టు చిత్ర బృందం అధికారికంగా తెలిపింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అలనాటి మేటినటి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన 'తలైవి' చిత్రాన్ని ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం అన్ని సన్నాహాలు చేసింది. అయితే పెరుగుతున్న కోవిడ్ కేసులని దష్టిలో ఉంచుకుని విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్టు నిర్మాతలు విష్ణువర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ తెలిపారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన చిత్రం కావడంతో ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని నిర్మాతలు అన్నారు.
డైలమాలో భారీ సినిమాలు
ఇప్పుడున్న పరిస్థితిని అంచనా వేయలేకపోతున్న తరుణంలో భారీ బడ్జెట్ సినిమాల దర్శక, నిర్మాతలు సైతం విడుదల తేదీల విషయంలో డైలమాలో పడ్డారు. దీంతో 'ఆచార్య', 'నారప్ప', 'ఖిలాడీ', 'పుష్ప', 'రాధేశ్యామ్' 'ఆర్ఆర్ఆర్' వంటి తదితర భారీ బడ్జెట్ సినిమాల మేకర్స్‌కి ఏం చేయాలో పాలు పోవడం లేదు. ఇప్పటికే వీళ్ళంతా విడుదల తేదీలను ప్రకటించడంతో భారీ స్థాయిలో వ్యాపార లావాదేవీలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో సెకండ్ వేవ్ అందరిన్నీ వణికిస్తోంది.
నాని నటించిన తాజా చిత్రం 'టక్ జగదీష్'. ఈ చిత్రాన్ని ఈనెల 23న విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. అలాగే రానా నటించిన 'విరాటపర్వం' చిత్రాన్ని ఈనెల 30న, మే 13న చిరంజీవి 'ఆచార్య', మే 14న వెంకటేష్ నటించిన 'నారప్ప', మే 28న రవితేజ 'ఖిలాడీ' చిత్రాలను, వీటితోపాటు జూన్, జులై, ఆగస్ట్ నెలల్లో వారానికి మూడు సినిమాల చొప్పున విడుదల చేసేందుకు మేకర్స్ ఇప్పటికే విడుదల తేదీలను ఖరారు చేశారు. ఇక అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని అక్టోబర్ 13న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ఆల్రెడీ ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమా కరోనా వల్ల వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈ సినిమాల విడుదల విషయంపై మేకర్స్ ఇప్పటివరకు అధికారికరంగా స్పందించకపోయినప్పటికీ, ఈ సినిమాల బిజినెస్ చేసిన డిస్ట్రిబ్యూటర్లు మాత్రం భయంతో వణికిపోతున్నారు.
చిన్న సినిమాల పరిస్థితీ ఇంతే..
పెద్ద సినిమాల పరిస్థితి ఇలా ఉంటే, చిన్న సినిమాల పరిస్థితి మరింత దారుణంగా ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. లాక్డౌన్ ప్రకటించకుండా 50 శాతం సీటింగ్ కెపాసిటీతో థియేటర్లను రన్ చేసినప్పటికీ చిన్న సినిమాలకు ఊహించిన స్థాయిలో కలెక్షన్లు రావడం సాధ్యం కాదు. వీటికి కచ్చితంగా 100 శాతం సీటింగ్ కెపాసిటీ ఉండాలి. పైగా చిన్న సినిమాలను చూడ్డానికి ప్రేక్షకులు కూడా అంతగా ఆసక్తి చూపకపోవచ్చు. ఎందుకంటే వారం రోజుల తర్వాత ఎలాగూ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో వస్తాయి కాబట్టి థియేటర్లకు వచ్చి రిస్క్ తీసుకోవడం ఎందుకనే ఆలోచనలో ప్రేక్షకులు ఉన్నారు. ప్రేక్షకులు ఇలా ఆలోచించడానికి కారణం కూడా మేకర్సే కావడం విచారించదగ్గ విషయం. ఎందుకంటే ఓ సినిమా విడుదలై కనీసం వారం రోజులు అయ్యిందో లేదో వెంటనే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. దీంతో చాలా సినిమాల విషయంలో ప్రేక్షకులు థియేటర్ల కంటే ఓటీటీకే ప్రాముఖ్యత ఇచ్చారు.
మరోసారి భారీ నష్టం..
సెకండ్ వేవ్ పరిస్థితి ఇలాగే కొనసాగి సినిమాల విడుదల వాయిదా పడితే తెలుగు చిత్ర పరిశ్రమకి మరోసారి కోలుకోలేని దెబ్బ పడటం ఖాయం. ఇప్పటికే కరోనా ఫస్ట్‌వేవ్ వల్ల తీవ్రంగా నష్టపోయిన తెలుగు సినిమా ఇప్పుడిప్పుడే ఊపిరి పోసుకుంటోంది. ఇలాంటి తరుణంలో సెకండ్ వేవ్ దెబ్బ వల్ల తెలుగు పెద్ద సినిమాల పరిస్థితి ఇలా ఉంటే,
ఊపందుకుంటున్న ఓటీటీలు
కరోనా లాక్డౌన్ వల్ల ఇంటికే పరిమితమైన ప్రేక్షకులకు వినోదాన్ని అందించే విషయంలో ఓటీటీ (ఓవర్ ది టాప్) ఫ్లాట్‌ఫామ్స్ సక్సెస్ సాధించాయి. ఓటీటీల వల్ల ప్రపంచ స్థాయి సినిమాలను, కంటెంట్‌ని చూడ్డానికి ప్రేక్షకులు ఇప్పటికే బాగా అలవాటు పడ్డారు. అయితే గత రెండు మూడు నెలలుగా థియేటర్లకు ప్రేక్షకులు రావడం మొదలు కావడంతో ఓటీటీల ఊపు కొంత తగ్గింది. అయితే ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ వల్ల మళ్ళీ మునుపటి స్థితి రానుందని వేరే చెప్పక్కర్లేదు.
షూటింగ్‌లకు సరికొత్త నిబంధనలు..
బాలీవుడ్లో సైతం పరిస్థితి చేయి దాటిపోవడంతో థియేటర్లను మూసివేశారు. అలాగే షూటింగ్‌ల విషయంలోనూ సరికొత్త కండీషన్లు పెట్టారు. ది ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్ (ఎఫ్‌డబ్లూఐసీఈ) బాలీవుడ్ సినిమాల షూటింగ్‌ల కోసం సరికొత్త నియమావళిని రూపొందించింది. అంతేకాకుండా సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే సినిమా చిత్రీకరణలు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలియజేసింది.
1. ఎక్కువ మంది ఆర్టిస్టులతో ఉన్న సన్నివేశాలను చిత్రీకరించకూడదు. గ్రూప్ సాంగ్స్ చిత్రీకరణ ఇప్పుడు జరగడానికి వీలులేదు.
2. సినిమా లొకేషన్స్, ప్రొడక్షన్ ఆఫీసులు, పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోల్లో క్రమం తప్పకుండా శానిటైజేషన్ చేయాలి. అలాగే ఆయా ప్రదేశాల్లో పని చేసేవాళ్లు తప్పకుండా మాస్క్ ధరించాలి.
3.ఎఫ్‌డబ్ల్యూఐసీఈ సంస్థకు చెందిన ఓ బందం షూటింగ్స్ జరిగే లొకేషన్స్‌కు చేరుకుని పర్యవేక్షించనుంది. ఒకవేళ ఎవరైనా కొవిడ్-19 నిబంధనలు పాటించకపోతే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు.
4. వారాంతంలో లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో ఆ రోజుల్లో చిత్రీకరణలు జరుపుకోవడానికి వీలులేదు.
ఇలాంటి నిబంధనలతోనే తెలుగు చిత్ర సీమలో కూడా షూటింగ్‌లు జరపాల్సిన పరిస్థితి రావచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి.