Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శంకర్, విక్రమ్ కాంబినేషన్లో రూపొందిన 'అపరిచితుడు' ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. సామాజిక కోణంలో సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. శంకర్ కెరీర్లో కూడా ఈ సినిమా ఒక ప్రత్యేకమైన సినిమాగా నిలిచిపోయిది. 2005లో తమిళంలో వచ్చిన 'అన్నియన్' చిత్రం తెలుగులో 'అపరిచితుడు' టైటిల్‌తో విడుదలై సెన్షేషనల్ హిట్ సాధించడంతోపాటు కాసుల వర్షం కురిపించింది.
ఇప్పుడు ఈ చిత్రాన్ని బాలీవుడ్లో రీమేక్ చేసేందుకు రంగం సిద్ధమైంది. రణ్వీర్ సింగ్ హీరోగా నటించబోతున్న ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో పెన్ స్టూడియోస్ నిర్మాణ సంస్థపై డా. జయంతిలాల్ గడ నిర్మించబోతున్నారు. తాజాగా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా దర్శకుడు శంకర్, నిర్మాత జయంతిలాల్, హీరో రణ్వీర్ సింగ్ కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ అధికారికంగా తెలిపారు. 'ఈ సమయంలో నా కంటే ఆనందంగా ఉండే వ్యక్తి మరొకరు ఉండరు. రణ్వీర్ సింగ్‌తో సూపర్ హిట్ చిత్రం 'అన్నియన్' (తమిళం) రీమేక్‌ని తెరకెక్కిస్తుండటం గొప్ప అనుభూతిని పంచుతోంది' అని శంకర్ చెప్పారు. కాగా శంకర్ - రామ్ చరణ్ కాంబినేషన్లో దిల్ రాజు ఓ పాన్ ఇండియన్ సినిమాని నిర్మించబోతున్నారు. అలాగే కమల్ హాసన్‌తో శంకర్ తెరకెక్కిస్తున్న 'ఇండియన్ 2' కూడా పూర్తి కావాల్సి ఉంది.