Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నరేష్, అలీ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం 'అందరూ బావుండాలి అందులో నేనుండాలి'. మలయాళంలో విడుదలై సంచలన విజయం సాధించిన 'వికృతి' చిత్రానికి ఇది రీమేక్. అలీవుడ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై అలీ సమర్పణలో శ్రీపురం కిరణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అలీబాబా, కొణతాల మోహన్, శ్రీచరణ్ నిర్మిస్తున్నారు. శరవేగంగా జరిపిన చిత్రీకరణతో 90 శాతం పూర్తి చేసుకుంది. ఉగాది పండగ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కృష్ణ మాట్లాడుతూ, 'నేను హీరోగా నటించిన సూపర్‌హిట్ చిత్రం 'పండంటి కాపురం' చిత్రంలోని 'ఏవమ్మా జగడాల వదినమ్మో...' పాటలో నరేష్‌ని ఎత్తుకుని ఆడిపాడాను. అలాగే విజయనిర్మల దర్శకత్వంలో నేను, సుజాత నటించిన 'సిరిమల్లె నవ్వింది' చిత్రంలో బాలనటునిగా అలీ నటించారు. ఇలా నా సినిమాల్లో బాలనటులుగా నటించిన ఈ ఇద్దరూ కలిసి ఓ సినిమాలో హీరోలుగా నటించటం ఓ విశేషమైతే, ఆ సినిమాని అలీ నిర్మించటం మరో విశేషం. చక్కని టైటిల్‌తో ఎమోషనల్‌గా ఉండే కంటెంట్‌తో సినిమాని తెరకెక్కించారని తెలిసి హ్యాపీగా ఫీలయ్యాను. ఈ సినిమా ద్వారా దర్శకుడు శ్రీపురం కిరణ్‌కి చక్కని పేరు, అలీకి నిర్మాతగా డబ్బు రావాలని కోరుకుంటున్నా' అని అన్నారు.
నరేశ్ మాట్లాడుతూ, 'ఈ సినిమాలోని నా పార్ట్ చిత్రీకరణతో పాటు డబ్బింగ్ కూడా పూర్తి చేశాను. ఈ సినిమాలో నటించినందుకు మనస్ఫూర్తిగా అలీకి థ్యాంక్స్ చెప్తున్నాను' అని చెప్పారు.
'తెలుగువారి ఉగాదితో పాటు, ముస్లిం సోదరుల రంజాన్ నెల ప్రారంభ రోజున సూపర్‌స్టార్ కృష్ణగారి ఆశీస్సులు మాకు, మా సినిమాకి దక్కడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో కూడా హిందూ ఫ్యామిలీ, ముస్లిం ఫ్యామిలీలకు సమానమైన ప్రాధాన్యం ఉంటుంది. మే నెల రెండో వారానికి అన్ని కార్యక్రమాలు పూర్తవుతాయి' అని అలీ తెలిపారు.
ఈ సినిమాలోని అన్ని పాటలను భాస్కరభట్ల రవికుమార్ రాశారు. ఏ.ఆర్ రెహమాన్ వద్ద సంగీత శాఖలో అనేక సినిమాలకు అసిస్టెంట్‌గా పనిచేసిన రాకేశ్ పళిదం ఈ చిత్రంతో సంగీత దర్శకునిగా ఆరంగేట్రం చేస్తున్నారు.