Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీనియర్ సినీ జర్నలిస్ట్, మ్యూజికాలజిస్ట్ హాసం రాజా (70) ఇకలేరు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన గురువారం కన్నుమూశారు. సంగీత పరమైన సినీ విశ్లేషణలకు హాసం రాజా పెట్టింది పేరు. 'వార్త' పత్రికలో సినిమా ఇన్ ఛార్జిగా పనిచేశారు. ఫ్రీలాన్సర్గా అనేక పత్రికల్లో వ్యాసాలు రాశారు. శాంతా బయోటెక్ కంపెనీ వ్యవస్థాపకుడు కె.ఇ.వరప్రసాద్ రెడ్డికి చెందిన 'హాసం' పత్రికకు సంపాదకుడిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. హాసం రాజా అసలు పేరు మంగు నరసింహస్వామి. శ్రీకాకుళంలో జూన్ 10, 1951లో పుట్టారు. చిన్న వయసు నుంచే సినిమాలు, పాటలపై ఆసక్తి ఉండేది. ఆ ఆసక్తితోనే సినీ సంగీతం పై వివిధ పత్రికల్లో వ్యాసాలను రాసి, కొత్త ఓరవడికి శ్రీకారం చుట్టారు. మ్యూజికాలజిస్ట్గా సినిమా పాటలను విశ్లేషించడంతోపాటు ఆ పాటల తమిళ, హిందీ, కన్నడ, బెంగాలీ, ఇంగ్లీషు పాటల మూలాలను వెలికితీసి, పరిశోధించి పాఠకులకు అందించేవారు. అలాగే తెలుగు సినిమా పాటలు, వాటి రాగాలపై 'ఆపాత మధురం' అనే పుస్తకాన్ని కూడా ఆయన రాశారు. పాటలకు సంబంధించి మీడియా రంగంలో ఎవరికి ఎలాంటి సందేహం వచ్చినా రాజాను సంప్రదించేవారంటే అతిశయోక్తి లేదు. ప్రతి శ్రోతకీ పాటల వివరాలు అందుబాటులో ఉండటానికి రాజా మ్యూజిక్ బ్యాంక్.కామ్ ఏర్పాటు చేశారు. దాదాపు 40వేల పాటలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇందులో ఉండటం విశేషం. 'నా పుట్టుక తల్లిదండ్రులకు సంబంధించింది. నా చావు భార్యాబిడ్డలకు చెందింది. నా బతుకు తెలుగు సినిమా పాటకి అంకితం' అంటూ ఓ సందర్భంలో ఆయన చెప్పారు. టీవీ నంది అవార్డులలో భాగంగా 2006 సంవత్సరానికి 'గుర్తుకొస్తున్నాయి' కార్యక్రమానికి ఫస్ట్ బెస్ట్ ఫీచర్ ఫిలింగా బంగారు నంది అవార్డుని, ఢిల్లీ తెలుగు అకాడమీ అందించే ప్రతిష్టాత్మక ఉగాది పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. 'హాసం' రాజా ఇకలేరని తెలిసిన సినీ పాత్రికేయ కుటుంబం కన్నీంటి పర్యంతమైంది.