Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'గోర్ జీవన్' చిత్రంతో హీరోగా, దర్శకుడుగా మంచి పేరు తెచ్చుకున్న కేపియన్ చౌహాన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'సేవాదాస్'. తెలుగు, బంజారా భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రీతి అశ్రాని హీరోయిన్. మరో హీరోయిన్గా రేఖా నిరోషా, సుమన్, భానుచందర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హాథీరామ్ బాలాజీ క్రియేషన్స్ పతాకంపై వినోద్ రైనా ఎస్లావత్, సీతారామ్ బాదావత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బోలే సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రంలోని బంజారా భాషకు సంబంధించిన టైటిల్ సాంగ్‌ను ఇటీవల ఆవిష్కరించారు. ఈ పాటను యువ గాయకుడు స్వరాగ్ ఆలాపించారు. 'నిజాయితీకి మారు పేరైన ఓ తండ్రి బాటలో నడిచే కొడుకు కథ ఎలా మొదలైంది?, ఎలా ముగిసింది? అనేదే ఈ చిత్ర కథాంశం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశలో ఉన్న ఈ చిత్ర ఆడియోను త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలోని టైటిల్ సాంగ్‌ని రిలీజ్ చేసిన అనంతరం సుమన్ మాట్లాడుతూ, 'నేను ఇప్పటి వరకు 8 భాషల్లో నటించాను. ఈ సినిమాతో తొమ్మిది భాషలు అవుతాయి. ఇందులో బంజారా కమ్యూనిటీకి ఆది గురువైన సేవాలాల్ పాత్రలో నటించాను. చౌహాన్ ఎంతో అనుభవం ఉన్న హీరోలా, దర్శకుడిలా సినిమాను తీర్చిదిద్దాడు. నిర్మాతలు కూడా ఎక్కడా రాజీ పడలేదు' అని తెలిపారు. దర్శకుడు, హీరో కేపియన్ చౌహాన్ మాట్లాడుతూ, ''గోర్ జీవన్' సినిమాతో తెలుగు ప్రేక్షకులు, బంజరా కమ్యూనిటీ వాళ్లు నన్ను ఎంతగానో ఆదరించారు. ఈ సినిమాతో ఎంతో అనుభవం ఉన్న సుమన్ గారిని డైరక్ట్ చేయడం, ఆయనతో కలిసి నటించడం అదష్టంగా భావిస్తున్నా. బోలే నా మొదటి సినిమా కంటే ఈ సినిమాకి అద్భుతమైన పాటలు ఇచ్చారు' అని తెలిపారు. 'బంజారా చిత్రాలకు చౌహాన్ ఐకాన్. ఈ సినిమా చాలా బాగా వచ్చింది' అని నిర్మాతలు అన్నారు.