Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి జంటగా రూపొందుతున్న చిత్రం 'సెహరి'. శుక్రవారం ఈ చిత్ర టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. 'మేకర్స్ చేసిన ప్రత్యేకమైన ప్రమోషన్లు, అలాగే హర్ష్‌ను వర్జిన్ స్టార్ అని పిలిచే వీడియోతో ఈ చిత్ర టీజర్ మంచి రెస్పాన్స్ సంపాదించడానికి ఎంతగానో ఉపయోగపడింది. వ్యూహాత్మకంగానే ఈ చిత్ర టీజర్లో నందమూరి బాలకృష్ట ప్రసంగాన్ని జత చేయటం విశేషం. బాలకృష్ణ గతంలో హర్ష్ కనుమిల్లిని 'వర్జిన్ స్టార్' అని పేర్కొన్న విషయం తెలిసిందే. అందుకే మేకర్స్ కూడా అదే ట్యాగ్ లైన్‌తో హర్ష్‌ని పిలవాలని నిర్ణయించుకుంది' అని చిత్ర బృందం తెలిపింది.
'మేం బాలకృష్ణ గారి ప్రసంగాన్ని 'సెహారీ' టీజర్లో చేర్చాం. ఈ సందర్బంగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం' అని మేకర్స్ ప్రకటించారు. తన ప్రియురాలితో కలిసి ఆనందకరమైన జీవితాన్ని గడిపే వరుణ్ పాత్రలో హర్ష్ కనిపించారు. ఒక్కసారిగా తనతో బ్రేకప్ అవడం, దాంతో మరోకరితో వివాహానికి సిద్ధమవడం, ఆ తర్వాత తను వివాహం చేసుకోబోయే అమ్మాయి అక్క సిమ్రాన్ చౌదరితో సన్నిహితంగా ఉండడం, తద్వారా తన భాగస్వామి ఎంపిక సరైనది కాదని అతను గ్రహించడం వంటి తదితర ఆసక్తికర అంశాలను టీజర్లో చూపించారు. హర్ష్ కనుమిల్లి కామెడీ టైమింగ్ ఈ టీజర్‌కి మేజర్ హైలెట్ అయ్యింది. దర్శకుడు జ్ఞాన సాగర్ ద్వారక ఈ చిత్రాన్ని యూత్ ఫుల్ రోమ్- కామ్ ఎలిమెంట్స్‌తో ఆహ్లాదకరంగా తెరకెక్కించారు. ప్రశాంత్ ఆర్ విహారీ నేపథ్య సంగీతం ఆకర్షణీయంగా ఉంది. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషించారు. శిల్ప చౌదరి భాగస్వామ్యంతో వర్గో పిక్చర్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా అద్వయ జిష్ణురెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి, అభినవ్ గోమటం, ప్రణీత్ రెడ్డి, అనీషా అల్ల, అక్షిత హరీష్, కోటి, బాలకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతలు: అద్వయ జిష్ణు రెడ్డి, శిల్పా చౌదరి, సినిమాటోగ్రఫి: సురేష్ సారంగం, ఎడిటర్: రవితేజ గిరిజల, ఆర్ట్: సాహి సురేష్.