Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా సెకండ్ వేవ్ పవర్‌స్టార్‌ని కూడా వదిలి పెట్టలేదు. పలు కార్యక్రమాల్లో పాల్గొనటంతో కరోనా బారిన పడకుండా ఉండేందుకు ఇటీవల ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా చేసిన పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ వచ్చింది. వైద్యుల ఆధ్వర్యంలో ఆయనకు చికిత్స జరుగుతోందని జనసేన పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.
'జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌కు కొవిడ్ సోకినట్లు నిర్ధారణ కావడంతో నిపుణులైన వైద్యుల ఆధ్వర్యంలో ఆయనకు చికిత్స జరుగుతోంది. ఈనెల 3న తిరుపతిలో పాదయాత్ర, బహిరంగ సభలో పాల్గొని పవన్ హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం కరోనా టెస్ట్ చేయించుకోగా, నెగెటివ్ వచ్చింది. అయినా వైద్యుల సూచన మేరకు వ్యవసాయ క్షేత్రంలో క్వారంటైన్లో ఉన్నారు. తాజాగా కొద్ది పాటి జ్వరం, ఒళ్లు నొప్పులు ఇబ్బంది పెడుతుండటంతో మరోసారి చేసిన కరోనా పరీక్షలో పాజిటివ్ అని వచ్చింది. ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ తంగెళ్ల సుమన్ ఆధ్వర్యంలో పవన్‌కు చికిత్స అందిస్తున్నారు. ఊపిరితిత్తుల్లో కొంత నిమ్ము చేరడంతో యాంటీ వైరల్ మందులతో చికిత్స అందిస్తున్నారు' అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
పవన్‌కల్యాణ్‌కు పాజిటివ్ అని తెలియడంతో ఆయన సోదరుడు చిరంజీవితో పాటు సురేఖ, రామ్‌చరణ్, ఉపాసన, నిర్మాత నాగవంశీలు ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకుంటూ, అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే అపోలో నుంచి కూడా ఒక వైద్య బందం పవన్ ఆరోగ్య పరిస్థితిని అనుక్షణం సమీక్షిస్తోంది. తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజలు, అభిమానుల ముందుకు వస్తానని పవన్ కల్యాణ్ చెప్పారు.