Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనోజ్ నందన్, నైనీషా, సాగర్, సరితా పాండా హీరో, హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'కథానిక'. రవి వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ ముఖ్యతారాగణంతో సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కిన చిత్రమిది. జగదీష్ దుగన దర్శకత్వంలో శ్రీమతి పద్మ లెంక నిర్మించిన ఈ చిత్రం ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత రామరావు లెంక, పద్మ లెంక మాట్లాడుతూ, 'కరోనా పరిస్థితుల్లోనూ నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ మాకెంతో బాగా సహకరించారు. సినిమా బాగా వచ్చింది. మా డైరెక్టర్ ఈ సినిమా అద్భుతంగా చిత్రీకరించారు. సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్గా ప్రేక్షకులను మా సినిమా తప్పకుండా మెప్పిస్తుంది' అని తెలిపారు. 'ఇదొక డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్. కథ చాలా కొత్తగా ఉంటుంది. ఇప్పటివరకు తెలుగు తెర మీద ఇలాంటి కథతో సినిమా రాలేదు. మా నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. మ్యూజిక్ లొకేషన్స్ ప్రతిదీ అద్భుతంగా ఉంటుంది' అని దర్శకుడు జగదీష్ దుగన చెప్పారు. హీరో సాగర్ మాట్లాడుతూ, 'ఇది నా మొదటి సినిమా. ఇది సస్పెన్స్ థ్రిల్లర్ అయినప్పటికీ ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే సినిమా' అని అన్నారు. 'నాకు హీరోయిన్గా అవకాశం ఇచ్చిన దర్శకుడు జగదీష్, నిర్మాత పద్మ లెంకకి ధన్యవాదాలు. ఓ మంచి సినిమాలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది' అని హీరోయిన్ నైనీషా చెప్పారు.