Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జెట్ స్పీడ్‌లో వ్యాపిస్తున్న కరోనా సెకండ్ వేవ్ తెలుగు చిత్ర పరిశ్రమను వణికిస్తోంది. ఊహించని రీతిలో కరోనా కేసులు పెరుగుతుండటంతో థియేటర్లను బంద్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే అత్యవసరమైతేనే, అది కూడా కేవలం 50 మంది సిబ్బందితోనే షూటింగ్‌లు చేసుకోవాల్సిన పరిస్థితీ వచ్చింది. వీటికి తోడు సోమవారం నుంచి ఈనెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వం రాత్రి పూట కర్ఫ్యూ విధించింది. ఇటువంటి పరిస్థితుల్లో గత్యంతరం లేక దర్శక, నిర్మాతలు తమ సినిమాల విడుదలను వాయిదా వేస్తున్నారు. మొత్తమ్మీద సెకండ్ వేవ్‌తో తెలుగు చిత్ర పరిశ్రమ మరోమారు భారీ నష్టాల ఊబిలో చిక్కుకోనుండటం విచారకరం.
థియేటర్లు బంద్
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో దాని కట్టడి కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలంగాణలో రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రాత్రి 9 తర్వాత దుకాణాలు, హోటళ్లు, బార్లు మూత పడనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో మూవీ థియేటర్ల నిర్వహణపై ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల సమావేశం జరిగింది. బుధవారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా థియేటర్లను మూసివేయనున్నట్లు ఈ సమావేశంలో ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. అయితే 'వకీల్‌సాబ్' ప్రదర్శించే థియేటర్లు మినహా మిగతావి మూసివేయాలని నిర్ణయించారు. కరోనా ఉద్ధతి, ప్రేక్షకుల ఆరోగ్యాన్ని దష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు తెలిపారు. ఇదిలా ఉంటే, 'వకీల్‌సాబ్'ని కోసం థియేటర్లను తెరచి ఉంచటం కరెక్ట్ కాదనే విమర్శలూ వెలువెత్తాయి. అయితే థియేటర్ల మూసివేత గురించి ప్రభుత్వం అధికారికంగా ఇంత వరకు ఏ ప్రకటన చేయలేదు.
అత్యవసరమైతేనే షూటింగ్‌లు
కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసరమైతే తప్ప సినిమాల చిత్రీకరణ చేయకూడదని నిర్ణయించుకుంది. ఈ మేరకు తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. అత్యవసర పరిస్థితుల్లో కొవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ 50 మందితోనే సినిమాల చిత్రీకరణ, నిర్మాంణాంతర కార్యక్రమాలను జరుపుకోవాలని నిర్మాతల మండలి సూచించింది. సినీ పరిశ్రమ మనుగడ, కార్మికుల ఆరోగ్యాన్ని దష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చలన చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కళ్యాణ్ ప్రకటించారు.
సినిమాల విడుదల వాయిదా
ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన 'ఇష్క్', 'తెలంగాణ దేవుడు' చిత్రాల విడుదలను వాయిదా వేస్తున్నట్టు సదరు చిత్ర బృందాలు అధికారికంగా ప్రకటించాయి.
1969 నుండి 2014 వరకు తెలంగాణ ప్రాంతంలోని పరిస్థితులను చూసి చలించి ఉద్యమాన్ని ముందుకు నడిపించి ప్రజల కష్టాలను తీర్చిన ఒక మహానీయుని జీవిత చరిత్రే 'తెలంగాణ దేవుడు'. 'కేసీఆర్‌గా శ్రీకాంత్ నటించిన 'తెలంగాణ దేవుడు' వంటి గొప్ప చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలని అనుకున్నాం. కానీ పెరుగుతున్న కరోనా కేసుల దష్ట్యా, ప్రజల శ్రేయస్సును కోరుతూ సినిమా విడుదలని వాయిదా వేస్తున్నాం. మా సినిమాని ఎప్పుడు విడుదల చేస్తామనేది త్వరలోనే ప్రకటిస్తాం' అని నిర్మాత మొహమ్మద్ ఇంతెహాజ్ అహ్మద్ చెప్పారు.
'దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న వేళ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తగిన మార్గ నిర్దేశకాలు విడుదల చేశాయి. అందులో భాగంగా ఏపీలో 50శాతానికి థియేటర్ల ఆక్యుపెన్సి తగ్గించడం, తెలంగాణలో రాత్రి పూట కర్ఫ్యూ విధించడం జరిగింది. ఇలాంటి టైమ్‌లో మా 'ఇష్క్' సినిమాని రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని భావించి, ఈ నెల 23న విడుదల కావాల్సిన మా చిత్రాన్ని వాయిదా వేస్తున్నాం. పరిస్థితులన్నీ అనుకూలించిన తర్వాత కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం' అని మేకర్స్ తెలిపారు.