Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పలు వైవిధ్యమైన పాత్రలతో దాదాపు ఐదు దశాబ్దాలుగా చిన్నపిల్లల దగ్గర్నుంచి పెద్దల వరకు అలరించిన సీనియర్ నటుడు పొట్టి వీరయ్య (74) ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్టు బంధువులు తెలిపారు.
పొట్టి వీరయ్య అసలు పేరు గట్టు వీరయ్య. బి. విఠలాచార్య 'అగ్గిదొర' (1967) చిత్రంతో మరుగుజ్జు నటుడిగా తెలుగు సినిమాకి పరిచయం అయ్యారు. దాసరి ప్రోత్సాహంతో 'తాతమనవడు' చిత్రంలో కీలక పాత్ర పోషించారు. 'సంసారం-సాగరం', 'దేవుడే దిగివస్తే', 'రాధమ్మ పెళ్లి', 'జగన్మోహిని', 'యుగంధర్', 'గజదొంగ', 'యమదొంగ', 'కొండవీటి రాజా', 'గోల నాగమ్మ', 'అత్తగారి పెత్తనం', 'టార్జాన్ సుందరి', 'చిన్నారి పాపలు' తదితర చిత్రాల్లో పొట్టి వీరయ్య నటించిన పాత్రలు ప్రేక్షకుల్ని బాగా అలరించాయి. ఆయన రూపంతోపాటు ఆయన పోషించిన చిత్ర, విచిత్రమైన పాత్రలు పిల్లలను అమితంగా ఆకట్టుకున్నాయి. చిరంజీవి, రజనీకాంత్, ఎమ్జీఆర్, నంబియార్, శివాజీగణేశన్ వంటి తదితర స్టార్ హీరోల సినిమాల్లోనూ వీరయ్య మెరిశారు.
స్టార్ హీరో శోభన్‌బాబు సలహా మేరకు దర్శకుడు విఠాలాచార్యని వీరయ్య కలిసి సినిమాల్లో వేషం ఇవ్వమని అడిగారు. భిన్నమైన రూపం ఉండటంతో విఠాలా చార్య తన 'అగ్గిదొర' చిత్రంలో వీరయ్యకి అవకాశం కల్పించారు. ఆ సినిమాతో ప్రారంభమైన వీరయ్య నట ప్రస్థానం అప్రహాతీతంగా సాగింది. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 500లకు పైగా చిత్రాల్లో నటించారు.
నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలానికి చెందిన ఫణిగిరిలో గట్టు సింహాద్రయ్య, నరసమ్మ దంపతులకు జన్మించారు.
స్కూల్లో, వేదికలపై నాటకాలు వేసేవారు. హెచ్ఎస్సి ఫెయిల్ కావడంతో నటుడు అవ్వాలని మద్రాసు చేరుకున్నారు. తొలుత సినిమాలకు డెకరేషన్ చేసే ప్లవర్ షాపులో కొంతకాలం పనిచేశారు.
ఆ సమయంలో నటుడు శోభన్‌బాబును కలిసి విషయం చెప్పడంతో 'వీరయ్య నీకు వేషాలు ఇవ్వాలంటే విఠలాచార్య, భావన్నారాయణ లాంటి వారు మాత్రమే ఇవ్వగలరు. వెళ్లి కలువు' అని సలహా ఇవ్వడంతో విఠలాచార్యను కలిసి అవకాశం దక్కించుకున్నారు. నటుడు రాజబాబు, దర్శకరత్న దాసరి లాంటి వారు తనని ఎంతగానో ప్రోత్సహించారని పొట్టి వీరయ్య పలు సందర్భంలో తెలిపారు.
వీరయ్య భార్య మల్లిక 2008లో కన్నుమూశారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె విజయదుర్గ నాటకాల్లో, సినిమాల్లోనూ నటించారు. భిన్న పాత్రలతో ప్రేక్షకులను విశేషంగా అలరించిన పొట్టి వీరయ్య మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.