Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అత్యాధునిక సాంకేతిక హంగులతో బోల్డెన్ని సినిమాలు రూపొంది ఆస్కార్ బరిలో గట్టి పోటీ ఇచ్చినప్పటికీ ఆస్కార్ జ్యూరీ మాత్రం భావోద్వేగాలకు ఫిదా అయ్యింది. అంతేకాదు ప్రస్తుతం ఉన్న కరోనా వంటి దారుణ పరిస్థితుల్లో ఎమోషన్స్ పంచుకునేందుకు నా.. అనే నలుగురు తప్పనిసరిగా ఉండాలని జ్యూరీ అవార్డులకు ఎంపిక చేసిన సినిమాలతో బలంగా తెలిపింది. దీని ఫలితంగా 'నోమ్యాడ్ లాండ్' చిత్రం ఏకంగా మూడు అవార్డులను కైవసం చేసుకుని విజయ కేతనాన్ని ఎగురవేసింది. 93వ అకాడమీ (ఆస్కార్) అవార్డుల వేడుక సోమవారం తెల్లవారుజామున లాస్ ఏంజిల్స్‌లోని డాల్భీ థియేటర్లో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా వైభవంగా జరిగింది. ఆహుతులు లేకుండా కేవలం సెలబ్రిటీలు మాత్రమే పాల్గొనటం ఆస్కార్ చరిత్రలో ఇదే తొలిసారి.
ప్రముఖ మహిళా దర్శకురాలు క్లోవీ చావ్ దర్శకత్వం వహించిన 'నోమ్యాడ్ ల్యాండ్' ఈసారి మూడు ముఖ్యమైన విభాగాల్లో (ఉత్తమ చిత్రం, దర్శకత్వం, నటి) అస్కార్ అవార్డులను అందుకుంది. 'ది ఫాదర్', 'మ్యాంక్', 'మినారి' వంటి చిత్రాలతో పోటీ పడి ఏకంగా మూడు పురస్కారాలను దక్కించుకోవడం విశేషం. ఫ్రాన్సెస్ మెక్‌డోర్మెండ్, లిండా మే, డేవిడ్, స్వాంకి వంటి హేమాహేమీలు నటించిన 'నోమ్యాడ్ లాండ్' సినిమా ఉత్తమ చిత్రం, దర్శకత్వం, నటి, ఆడాప్టెడ్ స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ వంటి ఆరు విభాగాల్లో పోటీ పడి మూడు విభాగాల్లో అవార్డులను కైవసం చేసుకోవడం ఓ విశేషమైతే, డేవిడ్ ఫించర్, థామస్ వింటెబెర్గ్, లీ ఐసాక్ చంగ్ వంటి దర్శక దిగ్గజాలు పోటీలో ఉన్నప్పటికీ ఉత్తమ దర్శకత్వ విభాగంలో దర్శకురాలు క్లోవీ చావ్( నో మ్యాడ్ ల్యాండ్) ఆస్కార్ గెలుచుకుని, తొలి ఆసియన్ మహిళా దర్శకురాలిగా చరిత్ర సష్టించారు.
83 ఏళ్ల వయసులోనూ నటుడిగా ప్రేక్షకుల్ని అలరిస్తున్న ఆంథోని హాప్కిన్స్కు ప్రతిష్టాత్మక ఆస్కార్ పురస్కారం వరించింది. 1992లో 'ది సైలెన్స్ ఆఫ్ ది లాంబ్స్' చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా అకాడమీ అవార్డు అందుకున్న ఆంథోని ఇన్నేళ్ల తర్వాత మరోసారి 'ది ఫాదర్' చిత్రానికి ఆస్కార్ గెలుచుకున్నారు. ఈ చిత్రంలో జ్ఞాపకశక్తిని కోల్పోయిన వద్ధుడి పాత్రలో ఆంథోని నటన ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలోని నటనకు పలు అంతర్జాతీయ పురస్కారాలకు సంబంధించిన నామినేషన్లు కూడా దక్కించుకున్నారు.
ఇదిలా ఉంటే, 63 యేళ్ల ఫ్రాన్సెస్ మెక్‌డోర్మెండ్ ముచ్చటగా మూడోసారి ఉత్తమనటి అవార్డు సొంతం చేసుకున్నారు. స్వేచ్ఛనిచ్చే తల్లిగా, వేధింపులకు గురైన భార్యగా, వ్యభిచారం చేసే మహిళగా, సంచార జీవితాన్ని గడిపే నోమ్యాడ్గా ...ఇలా ఎన్నో పాత్రలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటి ఫ్రాన్సెస్ మెక్‌డోర్మెండ్. ఇప్పటికే రెండుసార్లు ఉత్తమ నటిగా ఆస్కార్ అందుకున్న ఆమె ముచ్చటగా మూడోసారి 'నోమ్యాడ్‌లాండ్'లోని నటనకు సొంతం చేసుకున్నారు. ఇందులో భర్తను కోల్పోయిన 61 ఏళ్ల ఫెర్న్ అనే మహిళ పాత్రలో ఫ్రాన్సెస్ మెక్‌డోర్మెండ్ అద్భుతంగా నటించారు.
ఉత్తమ నటీనటుల విభాగంలో అవార్డులను సొంతం చేసుకోవడానికి వయసుతో సంబంధం లేదని ఆంథోని, ఫ్రాన్సెస్ నిరూపించారు.
ఉత్తమ చిత్రం 'నోమ్యాడ్ లాండ్'
ఒకే రకం జీవితానికి, ప్రాంతానికి అలవాటు పడకుండా సంచార జీవితం గడిపేవాళ్లను నోమ్యాడ్స్ అంటారు. రోడ్డు ప్రయాణంలోనే జీవితాన్ని వెతుక్కొనే ఒక రకమైన జీవనశైలి ఇది. ఆర్థిక మాంద్యం దెబ్బకు అమెరికన్ మధ్యతరగతి జీవితాలు కుదేలయ్యాయి. ఉద్యోగాలు, సన్నిహితులను కోల్పోయిన ఎందరో ఉపాథిó వేటలో కొత్త ప్రాంతాలను అన్వేషిస్తూ ఇలా సరికొత్త జీవితం ఆరంభించారు. వ్యక్తిగత స్వేచ్ఛను ఆస్వాదిస్తూ, మట్టివాసనకు, ప్రకతికి దగ్గరగా జీవిస్తూ తమని తాము ఆవిష్కరించుకొనే సరికొత్త జీవనశైలి ఇది. ఈ కథాంశం మీదే ఆసియన్ అమెరికన్ దర్శకురాలు క్లోవీ చావ్ 'నోమ్యాడ్ ల్యాండ్' చిత్రాన్ని తెరకెక్కించారు. 2017లో అమెరికన్ రచయిత్రి జెస్సికా బ్రూడర్ రాసిన 'నోమ్యాడ్ ల్యాండ్: సర్వైవింగ్ అమెరికా ఇన్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ' అనే పుస్తకం ఈ చిత్రానికి ఆధారం.
'ప్రతి వ్యక్తిలోను మంచితనం.. ఇతరులకు మేలు చేసే గుణాలు ఉంటాయి. వాటిని అంటిపెట్టుకుని ఉండాలన్నా, వాటి ద్వారా ఇతరులకు మేలు చేయాలన్నా చాలా ఆత్మసైర్థ్యం కావాలి. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ధైర్యంగా ముందుకు వెళ్లే సాహసం ఉండాలి. అలాంటి వారందరికీ ఈ అవార్డును అంకితమిస్తున్నాను. నేను ముందుకు వెళ్లటానికి మీరే స్ఫూర్తి'.
- దర్శకురాలు క్లోవీ చావ్
ఆస్కార్ విజేతలు
ఉత్తమ చిత్రం : నోమ్యాడ్ ల్యాండ్
ఉత్తమ నటుడు: ఆంథోని హాప్కిన్స్(ది ఫాదర్)
ఉత్తమ నటి: ఫ్రాన్సెస్ మెక్‌డోర్మెండ్ (నోమ్యాడ్ ల్యాండ్)
ఉత్తమ దర్శకురాలు: క్లోవీ చావ్ (నోమ్యాడ్ ల్యాండ్)
ఉత్తమ సహాయ నటుడు: డానియెల్ కలువోయా
(జుడాస్ అండ్ ది బ్లాక్ మిస్సయా)
ఉత్తమ సహాయ నటి: యున్ యా జంగ్ (మినారి)
ఉత్తమ సౌండ్: సౌండ్ ఆఫ్ మెటల్
ఉత్తమ సినిమాటోగ్రఫి: ఎరిక్ (మ్యాంక్)
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే: ఎమరాల్డ్ ఫెన్నెల్
(ప్రామిసింగ్ యంగ్ ఉమెన్)
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే: క్రిస్టోఫర్ హామ్టన్,
ఫ్లొరియన్ జెల్లర్ (ది ఫాదర్)
ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్: అనదర్ రౌండ్ (డెన్మార్క్)
ఉత్తమ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్:
సెర్హియోలోఫెజ్, మియానీల్,
జమికా విల్సన్ (మా రైనీస్ బ్లాక్ బాటమ్)
ఉత్తమ క్యాస్టూమ్ డిజైన్: అన్‌రాత్ (మా రైనీస్ బ్లాక్ బాటమ్)
ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: మార్టిన్ డెస్మండ్ రారు
(టూ డిస్టెంట్ స్ట్రేంజర్స్)
ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్: మైకల్ గ్రోవియర్
(ఇఫ్ ఎనిథింగ్ హ్యాపెన్స్ ఐ లవ్ యూ)
ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: పీట్ డాక్టర్, దానా మరీ (సోల్)
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్: అంథోనీ (కలెక్టివ్)
ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్: పిపా, జేమ్స్ రీడ్, క్రేగ్ ఫాస్టర్
(మై ఆక్టోపస్ టీచర్)
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: ఆండ్రూ జాక్సన్, డేవిడ్ లీ (టెనెట్)
ఉత్తమ ప్రొడెక్షన్ డిజైన్: డోనాల్డ్ బర్ట్ (మ్యాంక్)
ఉత్తమ ఒరిజినల్ స్కోర్: ట్రెంట్ రెజ్నర్ (సోల్)
ఉత్తమ ఒరిజినల్ సాంగ్: ఫైట్ ఫర్ యూ
(జుడాస్ అండ్ బ్లాక్ మెస్సయ్య)
ఉత్తమ ఎడిటింగ్ : మిక్కెల్ ఇ. జి. నీల్సన్
(సౌండ్ ఆఫ్ మెటల్)