Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'టాటా బిర్లా మధ్యలో లైలా' వంటి సూపర్‌హిట్ సినిమాతో నిర్మాతగా కెరీర్ ఆరంభించి ఎన్నో హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించారు లక్కీ మీడియా అధినేత బెక్కం వేణుగోపాల్. ప్రస్తుతం విశ్వక్సేన్ హీరోగా దిల్‌రాజుతో కలిసి 'పాగల్' సినిమాని తెరకెక్కిస్తున్నారు. నేడు (మంగళవారం) నిర్మాత బెక్కం వేణుగోపాల్ పుట్టినరోజు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని సోమవారం ఆయన మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు..
ఈ బర్త్‌డేకి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?
- బర్త్‌డేకి ఎలాంటి ప్రాముఖ్యత ఇవ్వను. నేను సినిమా మనిషిని. నా ధ్యాసంతా సినిమా మీదే ఉంటుంది. సెట్లో ఉంటే మా టీమ్, మీడియా వారితో కలిసి కేక్ కట్ చేసి, పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకునేవాడిని. అంతే కాని పెద్ద పెద్ద సెలబ్రేషన్స్ అయితే ఏమీ ఉండవు. ఈ సంవత్సరం కూడా 'పాగల్' రిలీజ్టైమ్లో బర్త్‌డే వస్తుంది. అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాను. కానీ ఇప్పుడు బయట పరిస్థితులు చూస్తుంటే కేక్ కూడా కట్ చేయాలనిపించడంలేదు. ఎందుకంటే ఇది కేవలం మనం మాత్రమే అనుభవిస్తున్న బాధ కాదు. ప్రపంచం అంతా కరోనాపై పోరాడుతూనే ఉంది. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇంతవరకు ఏ బర్త్‌డేకి చూడలేదు.
'పాగల్' సినిమాని వాయిదా వేయటంపై మీ ఫీలింగ్?
- గతేడాది మార్చి19న సినిమా ఓపెనింగ్ జరిపాం. వెంటనే మార్చి22న లాక్డౌన్ స్టార్టయ్యింది. తర్వాత నవంబర్ 1నుండి చిత్రీకరణ మొదలుపెట్టాం. చిత్రీకరణ పూర్తి చేసి, రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసి ఫస్ట్ కాపీ కూడా రెడీ చేశాం. మళ్లీ కరోనా సెకండ్ వేవ్ రూపంలో వైరస్ విజంభిస్తుండడంతో విడుదల తేదీని వాయిదా వేయాల్సి వచ్చింది. ఒక ఎగ్జైట్మెంట్తో సినిమా చేశాం. సినిమా చాలా బాగా వచ్చింది. అవుట్‌ఫుట్ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాం. ఇప్పటివరకూ సినిమా చూసిన వాళ్లందరూ గ్యారెంటీ హిట్ అన్నారు. ఇలాంటి సందర్భంలో సినిమా వాయిదా పడటం బాధ కలిగిస్తోంది.
'పాగల్' సినిమా ఎలా ఉండబోతోంది?
- ఫ్యామిలీ ఎమోషన్స్, మంచి ఎంటర్టైన్మెంట్తో ఉన్న ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. నవరసాలు కలిపి ఉన్న సినిమా. చిన్న పిల్లల దగ్గరనుండి పెద్దవాళ్ల వరకూ ఫ్యామిలీ అంతా కూర్చుని హ్యాపీగా ఎంజారు చేసే సినిమా ఇది. దర్శకుడు నరేష్‌కి ఫస్ట్ సినిమా అయినా చాలా బాగా తెరకెక్కించాడు. మా హీరో విశ్వక్ సేన్‌ది సింగిల్ హ్యాండ్ పెర్ఫామెన్స్ అని చెప్పొచ్చు. హీరోయిన్ నివేధా పేతురాజ్, అలాగే మురళి శర్మ ఇలా ప్రతి ఒక్కరూ చాలా బాగా చేశారు. మణికందన్ అద్భతమైన ఫోటోగ్రఫి ఇచ్చారు. రధన్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. మా టీమ్ అందరూ ఎలాగైన ఒక మంచి సినిమా చేయాలని కసితో చేసిన చిత్రమిది.
దిల్‌రాజుతో అసోసియేషన్ ఎలా ఉంది?
- దిల్‌రాజుగారు ఒక లెజెండ్. ఒక అన్నగా, గురువుగా నాకు ఆయన స్ఫూర్తి. ఆయనతో కలిసి ట్రావెల్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీలవుతున్నాను. ఆయన దగ్గరనుండి చాలా విషయాలు నేర్చుకున్నాను అది నా లైఫ్‌లో దొరికిన ఒక వరం. ఫస్ట్ నుండి లాస్ట్ వరకూ ఆయన ఫుల్ సపోర్ట్ ఉంది, కాబట్టే ఈ రోజు ఈ 'పాగల్' సినిమా ఇంత బాగా వచ్చింది.
15 ఏళ్ళు పూర్తి చేసుకున్న లక్కీ మీడియా ప్రస్థానం గురించి?
- అప్పుడే 15 సంవత్సరాలు పూర్తయ్యాయా అనిపిస్తుంది. నిర్మాతగా నా లైఫ్‌లో ఇదొక గొప్ప జర్నీ. ఎందుకంటే చాలా మంది గొప్ప వ్యక్తులతో కలిసి ట్రావెల్ అయ్యాను. మానసికంగా కూడా చాలా స్ట్రాంగ్ అయ్యాను. ఒక నిర్మాణ సంస్థను నెలకొల్పి 15 సంవత్సరాలుగా కంటిన్యూగా సినిమాలు తీస్తున్నందుకు లక్కీగా ఫీలవుతున్నాను. నా ఫ్యామిలీతోపాటు ఎంతో మంది నా ఫ్రెండ్స్ సపోర్ట్‌తో నా జర్నీ ముందుకెళ్తోంది. నా సినిమాలు నాకు డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌లు ఇచ్చాయి. ప్రతీ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఒక్కమాటలో చెప్పాలంటే నా ప్రతి సినిమా నాకొక కొత్త అనుభవాన్ని ఇచ్చింది. ఆ అనుభవంతోనే మరిన్ని మంచి సినిమాలను నిర్మిస్తాను.