Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం 'పుష్ప'. ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈనెల 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఇంట్రడ్యూసింగ్ పుష్పరాజ్ అనే పేరుతో హీరో పాత్రకు సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. రగ్డ్ లుక్, పెద్దగా ఉండే ఉంగరాల జుట్టుతో అల్లు అర్జున్ చేస్తున్న పుష్పరాజ్ పాత్రకు సంబంధించిన ఈ టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచింది. అంతేకాకుండా అటు బన్నీ అభిమానులను, ఇటు ప్రేక్షకుల్ని సైతం మెస్మరైజ్ చేసింది.
ఇదిలా ఉంటే, లేటెస్ట్గా ఈ టీజర్ టాలీవుడ్లో ఓ రికార్డ్‌ని క్రియేట్ చేసినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. టీజర్ విడుదలైన 19 రోజుల్లోనే ఈ టీజర్ 50మిలియన్ వ్యూస్‌ను దక్కించుకుందని, టీజర్ విడుదలైన అతి తక్కువరోజుల్లోనే ఈ రికార్డ్‌ను సాధించడం విశేషమని వేరే చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఇందులో బన్నీ ఓ సందర్భంలో చెప్పిన 'తగ్గేదే..లే' డైలాగ్‌కి విపరీతమైన అప్లాజ్ వచ్చింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం ఓ పోస్టర్ని సైతం మంగళవారం రిలీజ్ చేసింది. సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న టీజర్‌తో ఈ సినిమా రిలీజ్ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
'ఆర్య', 'ఆర్య2' చిత్రాల తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని ఇండిపెండెంట్ డే స్పెషల్‌గా ఆగస్ట్ 13న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తుంటే, మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా పతాకాలపై ఈ సినిమా నిర్మితమవుతోంది.