Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా సెకండ్ వేవ్ ధాటికి విశేష ప్రేక్షకాదరణ పొందిన సినిమాలు సైతం పూర్తి స్థాయిలో కలెక్షన్లను రాబట్టు కోలేకపోయాయి. రోజు రోజుకి పెరుగుతున్న వైరస్ విజృంభణతో ఇప్పుడు థియేటర్లను కూడా మూసెయ్యడంతో సినిమా ప్రదర్శనలకు అర్థంతరంగా ముగింపు పలకాల్సి వచ్చింది.
ఇటీవల విడుదలైన పవన్‌కళ్యాణ్ 'వకీల్‌సాబ్' మంచి ఆదరణ పొందింది. విడుదలైన నాలుగైదు రోజుల వరకు విపరీతమైన కలెక్షన్లనూ రాబట్టింది. తర్వాత రోజు నుంచి థియేటర్లను మూసెయ్యడంతో ఈ సినిమా భారీ స్థాయిలో నష్టపోయింది. ఓవర్సీస్లోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో మొత్తంగా 'వకీల్‌సాబ్' ఇంకా సేఫ్ జోన్లోకి రాలేదని స్పష్టమవుతోంది. వెండితెర ప్రేక్షకులను విశేషంగా అలరించిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ మాధ్యమంలో ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈనెల 30 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ ఇండియా ట్వీట్ చేసింది.
హిందీలో ఘన విజయం సాధించిన 'పింక్' సినిమా రీమేక్‌గా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో దిల్‌రాజు ఈ సినిమా నిర్మించారు. ప్రకాష్ రాజ్, అంజలి, నివేదా థామస్, అనన్య, శ్రుతి హాసన్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు.
ఇదిలా ఉంటే, ఇటీవల విడుదలైన కార్తి 'సుల్తాన్' చిత్రం సైతం ఈనెల 30 నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది. కార్తి, రష్మిక మందన్న జంటగా భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రీసెంట్గా థియేటర్స్‌లో విడుదలై సందడి చేసిన సంగతి తెలిసిందే. కార్తి హీరోగా నటించిన 'ఖైది' చిత్రం కూడా 'ఆహా'లో విడుదలై మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు అదే కోవలో 'సుల్తాన్' చిత్రం కూడా ప్రేక్షకుల్లో అదే రకమైన ఆసక్తిని రేకెత్తిస్తుందని 'ఆహా' ప్రతినిధులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 30 నుంచి 'సుల్తాన్' స్ట్రీమింగ్ జరుగుతుందని మంగళవారం 'ఆహా' సంస్థ అధికారికంగా ప్రకటించింది.