Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మీ పెద్ద మనసుని చాటుకునే తరుణం ఆసన్నమైంది.. సాయం చేద్దాం రండి అని యువ హీరోలు నాగ చైతన్య, రానా దగ్గుబాటి సోషల్ మీడియా వేదికగా కోరారు.
రోజు రోజుకి కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో దేశ వ్యాప్తంగా లక్షల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారికి చేయూతనివ్వాలనే సంకల్పంతో రానా, చైతూ సాయం చేయండి అంటూ అభ్యర్థిస్తున్నారు. 'ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులతో చాలా మంది బాధపడుతున్నారు. వాళ్ల మనుగడకి మనవంతు కషి చేద్దాం. అందరూ కలిసి సాయం చేయాలని కోరుతున్నాను. అత్యవసరాలైన ఆక్సిజన్, ఆహారం, మందులు అందించేందుకు ముందుకొస్తారని భావిస్తున్నాను' అని రానా ట్వీట్లో పేర్కొనగా, 'ఈ క్లిష్ట సమయంలో చిన్న సాయం అయినా ఎంతో ఉపయోగపడుతుంది. దయచేసి మీకు తోచిన సాయం చేయండి. మాస్క్ ధరించండి.. జాగ్రత్తగా ఉండండి' అని నాగ చైతన్య.తన ట్వీట్లో వేడుకున్నారు.
కరోనా సెకెండ్ వేవ్ విళయతాండవం చేస్తున్న నేపథ్యంలో ఆస్పత్రుల్లో రోగులకు అండగా నేనుంటాను అంటూ తమిళ కథానాయకుడు విజరు మరోసారి ముందుకొచ్చారు. విరుదాచలంలోని గవర్నమెంట్ ఆసుపత్రులకు వచ్చే రోగులకు ఆక్సిజన్ సిలిండర్లు, వైద్యులకు, ఆస్పత్రిలో పని చేసే సిబ్బందికి అవసరమైన మాస్క్‌లను, పీపీఈ కిట్లను అందించి తన మానవత్వాన్ని చాటుకున్నారు.
విజయ్ ఆదేశాలతో ఆయన అభిమానులు కోవిడ్ బాధితులను ఆదుకునేందుకు, వారికి సాయం అందించడానికి రంగంలోకి దిగారు. విజరు మాదిరిగానే బాలీవుడ్లో అక్షరుకుమార్, అజరుదేవగన్, సోనూసూద్ తదితరులు సెకండ్ వేవ్ వల్ల ఆక్సిజన్ కొరత ఏర్పడిన పలు ప్రాంతల్లో ఆక్సిజన్ సిలిండర్లను అందించి తమ పెద్ద మనసు చాటుకున్నారు.
మనమే లాక్డౌన్ పాటిద్దాం
సెకండ్ వేవ్ ధాటికి రోజు రోజుకి మరణాల సంఖ్య ఊహించలేని విధంగా ఉంటోంది. దీంతో ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో లాక్డౌన్లు విధించారు. రానున్న రెండు, మూడు వారాలు ఎంతో క్లిష్టంగా ఉండనున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో లాక్డౌన్ విధించే అవకాశాలున్నాయనే వార్తలు బాగా వినిపిస్తుంటే, సోషల్ మీడియాలో మాత్రం లాక్డౌన్ పెట్టే అవకాశం లేదంటూ నెటిజన్లు పోస్టుల వర్షం కురిపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో వీటిపై 'మహానటి' దర్శకుడు నాగ్అశ్విన్ గురువారం సామాజిక మాధ్యమం ద్వారా స్పందించారు. లాక్డౌన్ ఉన్నా లేకున్నా రానున్న కొద్ది రోజులు మాత్రం తప్పనిసరిగా ఇంట్లోనే ఉందామని ఆయన విజ్ఞప్తి చేశారు. 'లాక్‌డౌన్‌పై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా, తీసుకోకపోయినా రానున్న రెండు వారాలు వ్యక్తిగతంగా లాక్డౌన్ పాటిద్దాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు లాక్డౌన్ సమాధానం కాదని ఎవరైతే అంటున్నారో వాళ్లందరూ ఒక్కసారి వెళ్లి ఆసుపత్రులను చూసి రండి. అలాగే గడిచిన నెల రోజుల నుంచి డాక్టర్లు ఎలా సేవలందిస్తున్నారో చూడండి. కాబట్టి, తప్పనిసరిగా వైద్యులకు కొంత ఉపశమనం అందిద్దాం. మనందరం కూడా వ్యాక్సిన్ వేయించుకుందాం' అని నాగ్అశ్విన్ ట్వీట్లో పేర్కొన్నారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, గీతా ఆర్ట్స్, డివివి ఎంటర్టైన్మెంట్స్, సితార ఎంటర్టైన్మెంట్స్ వంటి తదితర నిర్మాణ సంస్థలు సైతం సోషల్ మీడియా వేదికగా అత్యవసరమైన వారికి ఆక్సిజన్, మెడిసిన్స్, బెడ్స్, బ్లడ్ అందేలా తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు.