Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉండటంతో థియేటర్స్ మూతపడ్డాయి. విపరీతంగా పాజిటివ్ కేసులు పెరుగుతుండటం వల్ల ఇప్పటికే చాలా సినిమాల చిత్రీకరణలూ నిలిపివేశారు. ఈ నేపథ్యంలోనే ఈ నెలలో రిలీజ్ కావాల్సిన 'లవ్ స్టోరి', 'టక్ జగదీష్', 'విరాట పర్వం', అలాగే మే 13న రిలీజ్ కావాల్సిన 'ఆచార్య' సినిమాల రిలీజ్ డేట్లను పోస్ట్‌పోన్ చేశారు. ఈ క్రమంలోనే మే 14న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన 'నారప్ప' సినిమాని సైతం పోస్ట్‌పోన్ చేస్తున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ గురువారం అధికారికంగా తెలిపింది. వెంకటేష్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.
'నారప్ప' కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు, అభిమానులు అందరికీ మనవి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనందరి ఆరోగ్యం, రక్షణ దష్టిలో ఉంచుకుని సినిమా విడుదలను వాయిదా వేస్తున్నాం. పరిస్థితులు చక్కబడిన తర్వాత అతి త్వరలోనే ఈ చిత్రాన్ని మీ ముందుకు తెచ్చేందుకు ప్రయత్నిస్తాం. ఈ మహమ్మారి వీలైనంత తొందరగా దూరం కావాలని, అందరూ క్షేమంగా ఉండాలని ఈ సినిమా కోసం ఇష్టం, అంకితభావంతోనూ పని చేసిన ప్రతి ఒక్కరం కోరుకుంటున్నాం. ఇళ్లలోనే ఉండి మనపట్ల, మన కుటుంబసభ్యుల పట్ల అప్రమత్తంగా ఉందాం. ఈ క్లిష్ట పరిస్థితిని అందరం కలిసికట్టుగా ఎదుర్కొందాం. అందరూ మాస్కులు ధరించి, దూరాన్ని పాటిస్తూ ఎవరికి వారు జాగ్రత్తగా ఉండటమే మనం పొరుగువారికీ, సమాజానికీ చేసే గొప్ప సాయం. త్వరలోనే మీ ముందుకు వచ్చి మిమ్మల్నిందర్నీ అలరించాలని కోరుకుంటున్నాం' అని 'నారప్ప' టీమ్ సోషల్ మీడియా వేదికగా పేర్కొంది.
తమిళనాట సంచలన విజయం సాధించిన 'అసురన్' చిత్రాన్ని 'నారప్ప'గా తెలుగులో రీమేక్ చేస్తున్నారు.