Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీటీలో రిలీజ్ చేయం. అటువంటి ఆలోచన కూడా మాకు లేదు. ఎందుకంటే కొన్ని అద్భుతాల్ని వెండితెరపై చూడాలి. అలాంటి అద్భుతమైన సినిమా 'ఆర్ఆర్ఆర్''. ఈ సినిమా విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ని మాటల్లో చెప్పలేం. అది వెండితెరతోనే సాధ్యం' అని అంటున్నారు ఎన్టీఆర్.
కరోనా సెకండ్ వేవ్ ధాటికి ప్రపంచ వ్యాప్తంగా సినీ పరిశ్రమ మరోమారు అతలాకుతలమైపోతోంది. ఇదే కోవలో తెలుగు చిత్ర సీమ సైతం తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. థియేటర్లు మూతపడ్డాయి. షూటింగ్‌లు నిలిచిపోయాయి. కొత్త సినిమాల రిలీజ్లు వాయిదా పడ్డాయి. వీటికి తోడు సినీ ప్రముఖులు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ఇటువంటి తరుణంలో భారీ బడ్జెట్ సినిమాల పరిస్థితి గురించి అందరూ చర్చిస్తున్నారు.
ఇందులో భాగంగా 'ఆర్ఆర్ఆర్' సినిమాని కూడా ఓటీటీల్లో రిలీజ్ చేయబోతున్నారనే వార్తలు ఇటీవల చక్కర్లు కొడుతున్నాయి. అయితే అది వాస్తవం కాదని ఎన్టీఆర్ తేల్చి చెప్పారు. కరోనా పాజిటివ్ కారణంగా హోం క్యారెంటైన్లో ఉన్న ఎన్టీఆర్ ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఆయన తెలిపిన పలు ఆసక్తిరమైన విశేషాలు..
'ఆర్ఆర్ఆర్' సినిమాకి సంబంధించి వర్క్ 2018 నవంబర్లోనే ఆరంభమైంది. రాజమౌళి గురించి అందరికీ తెలిసిందే కదా. ఏదైనా సరే పర్ఫెక్ట్గా ఉండాలి. లేకపోతే అస్సలు రాజీపడరు. అందుకే తన సినిమాలకు చాలా సమయం తీసుకుంటారు. ఆయన తీరు చూసి నేనే 'జక్కన్న' అనే పేరు పెట్టా
(నవ్వుతూ). 'ఆర్ఆర్ఆర్'కి సంబంధించి అధిక భాగం చిత్రీకరణ పూర్తయింది. కరోనా వల్ల మరోమారు వాయిదా పడింది. అయితే మా సినిమాని అందరూ పాన్ ఇండియా సినిమా అంటున్నారు. నాకు పాన్ ఇండియా సినిమా అనటం నచ్చదు. నా దృష్టిలో ఇది అందరూ చూడదగ్గ సినిమా అంతే.
''ఆర్ఆర్ఆర్'ను ఓటీటీలో విడుదల చేసే ఆలోచన ఏమాత్రం లేదు.
'బాహుబలి', 'జురాసిక్ పార్క్', 'అవేంజర్స్'లాంటి సినిమాల్ని ఎవరైన ఓటీటీల్లో చూస్తారా..? ఇది కూడా అంతే. కొన్ని సినిమాలను థియేటర్స్‌లోనే చూడాలి. పెద్ద స్క్రీన్‌పై ప్రేక్షకుల మధ్య కూర్చుని ఆస్వాదించే అద్భుతమైన సినిమా 'ఆర్ఆర్ఆర్'.
నిజమైన హీరోల గురించి అందరికీ తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఈ సినిమాలో నేను నటిస్తున్న కొమురం భీమ్ పాత్ర కోసం ఎంతో పరిశోధన చేశారు. నా కెరీర్లో ఇలాంటి పాత్ర చేయలేదు.
దర్శకత్వం చేయాలనే ఆలోచన లేదు. అయితే.. మంచి కథలను నిర్మించే ఆలోచన ఉంది.
హాలీవుడ్లో అవకాశం వస్తే ఎవరైనా చేస్తారు. నేను కూడా అంతే. మంచి కథతోపాటు అవకాశం లభిస్తే కచ్చితంగా హాలీవుడ్ సినిమాలో యాక్ట్ చేస్తా.
'ఆర్ఆర్ఆర్' తర్వాత కొరటాల శివతో సినిమా చేయబోతున్నా. గతంలో 'జనతా గ్యారేజ్' చేశాం. అది పెద్ద బ్లాక్బస్టర్హిట్ అయ్యింది. 'ఆర్ఆర్ఆర్' పూర్తవగానే ఆ సినిమా మొదలు పెడతాం. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుగుతోంది. కొరటాల సినిమా తర్వాత ప్రశాంత్‌నీల్‌తో మరో సినిమా చేస్తున్నా.
కోవిడ్ పాజిటివ్ కారణంగా హోం క్వారంటైన్లో ఉన్నా. కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతున్నాను. అమ్మ, భార్య, పిల్లలు.. వాళ్లతో ఉండటం ఒక ఎమోషన్. డాక్టర్ల సూచన మేరకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నా. నా ఆరోగ్యం విషయంలోఅభిమానులు ఎటువంటి ఆందోళన పడొద్దు.
చిరు పలకరింపు..
కరోనా పాజిటివ్ కారణంగా ఇంటికే పరిమితమైన ఎన్టీఆర్ ఆరోగ్యం గురించి చిరంజీవి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని మెగాస్టార్ స్వయంగా ట్విట్టర్ వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్నారు.
'కాసేపటి క్రితం తారక్‌తో ఫోన్లో మాట్లాడాను. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ హోం క్వారంటైన్లో ఉన్నట్లు చెప్పారు. తారక్‌తోపాటు ఆయన కుటుంబసభ్యులు సైతం ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారు. తారక్ ఎంతో ఉత్సాహంగా ఉన్నారని తెలుసుకుని నాకెంతో ఆనందంగా అనిపించింది. త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని ఆశిస్తున్నాను' అని చిరు ట్వీట్లో పేర్కొన్నారు.