Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అలాగని ప్రతి సినిమా 'బాహుబలి'లా అపూర్వ విజయాల్ని సొంతం చేసుకుంటా యనేది కూడా భ్రమే. ఇందుకు ఎన్టీఆర్ 'కథానాయకుడు', 'మహా నాయకుడు' సినిమాలే ప్రత్యక్ష ఉదాహరణ. ఆల్‌రౌండర్ ఎన్టీఆర్ జీవితానికి సంబంధించి ప్రతి విషయమూ ఆసక్తికరమే. దీంతో మేకర్స్ ఆయన బయోపిక్‌ని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఎన్టీఆర్ గురించి అందరికీ బాగా తెలిసి ఉండటంతో వీటిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆకట్టుకునేలా కథనం లేకపోవడంతో ప్రేక్షకుల అంచనాలను చేరలేక బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచాయి. దీంతో నిర్మాతతోపాటు ఈ సినిమాని పంపిణీ చేసిన డిస్ట్రిబ్యూటర్లు సైతం భారీగా నష్టపోయారు.
ఇప్పటివరకు సీక్వెల్స్ పంథాని చూశాం. ఇక ఇప్పట్నుంచి రెండు పార్టుల ట్రెండ్‌ని చూడబోతున్నాం. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న 'బాహుబలి' తెలుగునాట రెండు భాగాల ట్రెండ్‌కి నాంది పలికింది. దీంతో పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కించే సినిమాలను రెండు భాగాల పద్ధతిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఓ సినిమా హిట్ అయితే, వెంటనే దానికి సీక్వెల్ తీసి జయాలతోపాటు అపజయాలనూ పొందారు. అయినప్పటికీ సీక్వెల్ ట్రెండ్ ఇప్పటికీ ఎంతో కాన్ఫిడెంట్‌గా ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నిస్తోంది.
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా అయినా కూడా ఒకే భాగంలో చెప్పే వాళ్ళు. ఒక్కోసారి మూడు గంటలకు పైగా నిడివితో సినిమా తీసేవాళ్ళు. అయితే ఒక భాగంలో చెప్పలేని కథలు ఉంటే రెండు భాగాలుగా సినిమాలు తీసేందుకు ఇప్పుడు మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. కానీ సీక్వెల్ మాదిరిగా రెండు పార్టుల ధోరణి ఉండదు. మొదటి పార్ట్‌కి సంబంధించిన ఎండింగ్ (క్లయిమాక్స్) కచ్చితంగా రెండో పార్ట్‌కి లీడ్‌గా ఉంటుంది. అంతేకాదు రెండో పార్ట్ ఆసాంతాన్ని ఇదే సమర్థవంతంగా నడిపించాలి. ఇదెలా ఉండాలంటే 'కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?' అనే ఆసక్తికరమైన ప్రశ్నగా ఉండాలి. ఈ ప్రశ్నే 'బాహుబలి 2' కోసం అందర్నీ పడిగాపులు పడేలా చేసింది. అంతేకాదు ఇది ఎంతగా పాపులర్ అయ్యిందంటే.. టీవీ షోలు, క్రికెట్ మ్యాచ్‌ల కామెంటరీలు.. ఇలా సందర్భం దొరికిన ప్రతి చోటా..'కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు' అంటూ సరదాగా అనుకున్న సందర్భాలూ కోకొల్లలు. దీంతో 'బాహుబలి 2'కి విపరీతమైన క్రేజ్ వచ్చి కలెక్షన్ల వర్షం కురిపించింది.
ఒకే కథను రెండు భాగాలుగా తీసి ప్రేక్షకులను మెప్పించడం అంత సులువేం కాదు. అందుకు తగ్గట్టు కథాకథానాలు కచ్చితంగా ఉండాలి. అలాగే నిర్మాణ పరంగా కూడా భారీ బడ్జెట్ అవుతుంది. ఇక పాన్ ఇండియా స్థాయిలో రెండు భాగాల సినిమా అంటే వేరే చెప్పక్కర్లేదు. అయితే ఇది దేశ వ్యాప్తంగా ఓ నయా ట్రెండ్‌గా మారింది. రెండు భాగాలతో సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడాన్ని దర్శక, నిర్మాతలు సైతం ఓ ఛాలెంజింగ్‌గా తీసుకుంటున్నారు. దీనికి తగ్గట్టే పక్కా ప్లానింగ్‌తో సినిమాలను నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఈ పంథాలోనే అల్లు అర్జున్ నటిస్తున్న 'పుష్ప' సినిమాని రెండు భాగాలుగా మేకర్స్ రిలీజ్ చేయబోతున్నారు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం 'పుష్ప'. రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా గురించి మేకర్స్ గురువారం అధికారిక ప్రకటన కూడా చేశారు.
'ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' రెండు భాగాల్లో రానుంది. 'పుష్ప' కథ ప్రకారం రెండు భాగాలుగా ఈ సినిమాను తీసే విధంగా చిత్ర బందం సన్నాహాలు చేస్తోంది. 'పుష్ప' మొదటి భాగానికి సంబంధించి కొన్ని సన్నివేశాలు మినహా మొత్తం సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయ్యింది. రెండు భాగాలకు కలిపి దాదాపుగా 250 నుంచి 270 కోట్ల బడ్జెట్ అవుతుంది' అంటూ మేకర్స్ తెలిపారు. 'ఆర్య', 'ఆర్య2' తర్వాత అల్లుఅర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదల చేసిన పోస్టర్లు, టీజర్.. విశేషంగా అలరించి ఆ అంచనాలను రెట్టింపు చేశాయి. దీంతో ఈ సినిమా కోసం అందరూ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో రెండు భాగాలుగా 'పుష్ప'ని తీసుకురాబోతున్నామంటూ మేకర్స్ ఎనౌన్స్ చేసి సర్ప్రైజ్ చేశారు.
రెండు పార్టులుగా సినిమాలు తీసే ధోరణిలో ఎన్ని లాభాలు ఉన్నాయో, అన్ని నష్టాలూ ఉన్నాయి. ముఖ్యంగా ఆకట్టుకునే కథాకథనాలు లేకపోతే ఇంతే సంగతులు. అలాగే కేవలం కాంబినేషన్ పరంగా లేకపోతే బిజినెస్ పరంగా రెండు భాగాలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వర్కౌట్ అవ్వదు. నిజంగా కథలో విషయం ఉండి, రెండు భాగాలుగా చెప్పే వీలు ఉంటే మాత్రం కాసుల వర్షమే అని వేరే చెప్పక్కర్లేదు.