Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా సెకండ్ వేవ్ రోజు రోజుకి మరింతగా విజృంభిస్తోంది.
- వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
- కుటుంబ సభ్యుల్ని, ఆప్తుల్ని పోగొట్టుకుని చాలా మంది శోకసంద్రంలో ఉన్నారు.
- ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో బాధితులను ఆదుకోవడమే లక్ష్యంగా
చిన్నా పెద్దా తేడా లేకుండా సెలబ్రిటీలందరూ
సాయం అందిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
నిర్లక్ష్యంగా ఉండకండి.. ప్లీజ్ : చిరంజీవి
'కరోనా సెకండ్ వేవ్ ఎటువంటి భయానక వాతావరణాన్ని సష్టించిందో తెలియంది కాదు. ఈ మహమ్మారి వల్ల ఎందరో తమ ఆత్మీయుల్ని పోగొట్టుకుని తల్లడిల్లిపోతున్నారు. అవసరమై బయటకు వస్తే, తప్పనిసరిగా మాస్క్ ధరించండి' అని చిరంజీవి సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. ట్విట్టర్ వేదికగా చిరంజీవి శుక్రవారం ఓ వీడియోను విడుదల చేశారు. 'కరోనా సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉంది. చాలా మంది ఈ వైరస్ బారిన పడి, ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. కోలుకోవడానికి కూడా చాలా సమయం పడుతుంది. మన ఆత్మీయులలో కొందరినీ ఈ వైరస్ వల్ల కోల్పోతున్నామంటే గుండె తరుక్కుపోతోంది. ఈ తప్పనిసరి పరిస్థితుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ లాక్డౌన్ పెట్టారు. కనీసం ఇప్పుడైనా అలక్ష్యం చేయకుండా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఇంటి నుంచి బయటికి రాకండి. ఒకవేళ లాక్డౌన్ సడలించిన వేళల్లో బయటికి వచ్చినా మాస్కులు ధరించండి. వీలైతే డబుల్ మాస్కులు ధరించండి. లాక్డౌన్లో కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. వ్యాక్సినేషన్ తర్వాత కరోనా పాజిటివ్ వచ్చినా దాని ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరు కొవిడ్ పాజిటివ్ అయినా దయచేసి భయపడకండి. వైరస్ కంటే మన భయమే మనల్ని ముందు చంపేస్తుంది. పాజిటివ్ అని తెలిసిన వెంటనే మిమ్మల్ని మీరు, ఇతర కుటుంబ సభ్యుల నుంచి ఐసోలేట్ చేసుకుని, డాక్టర్ల సూచనతో మందులు వాడండి. అత్యవసరం అయితేనే తప్ప సత్వర చికిత్స కోసం హాస్పిటల్లో చేరండి. కరోనా నుంచి కోలుకున్న నెలరోజుల తర్వాత మీలో యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయి. అప్పుడు మీరు ప్లాస్మా డొనేట్ చేస్తే, కరోనా నుంచి కనీసం ఇద్దరిని కాపాడినవారవుతారు. దయచేసి ప్లాస్మా దానం చేయండి. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సురక్షితంగా ఉండండి' అని చిరు ఈ వీడియోలో పేర్కొన్నారు.
రజనీ రూ.కోటి విరాళం
ఆక్సిజన్ సిలిండర్లు, మందులు, బ్లడ్, ఫ్లాస్మా.. ఇలా అవసరమైన వాటిని బాధితులకు చేరవేసేందుకు భిన్న రూపాల్లో సెలబ్రిటీలు స్పందించి పెద్ద మనసు చాటుకుంటున్నారు. ఇందులో భాగంగా అగ్ర నటుడు రజనీకాంత్ కోటి రూపాయల విరాళాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేశారు. రజనీ తరఫున ఆయన కూతురు సౌందర్య రజనీకాంత్, అల్లుడు విషగన్ తమిళనాడు నూతన సీఎం ఎం.కె.స్టాలిన్‌కి అందజేశారు. అలాగే మరో అగ్రనటుడు అజిత్ సైతం సీఎంని కలిసి రూ. 25 లక్షల సాయాన్ని అందించారు. దర్శకుడు ఎ.ఆర్. మురుగదాస్ సైతం ముఖ్యమంత్రి సహాయ నిధికి 25 లక్షల రూపాయలను విరాళంగా అందించి తమ సేవాగుణాన్ని చాటుకున్నారు. ఇటీవల హీరో సూర్య, తండ్రి శివకుమార్, సోదరుడు కార్తితో కలిసి కొవిడ్ రిలీఫ్ ఫండ్‌కి కోటి రూపాయలను అందించిన సంగతి తెలిసిందే.
సినీ కార్మికులను ఆదుకోండి : సెల్వమణి
కరోనా మహమ్మారి విలయతాండానికి చిత్రపరిశ్రమ తీవ్రంగా నష్టపోయింది. సినిమా పరిశ్రమనే నమ్ముకుని ఉన్న అనేక మంది కార్మికులకు ఉపాథి లేకపోవడంతో పస్తులు ఉండాల్సిన దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల తమిళనాడు రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఎం.పి.స్వామినాథన్‌తో తమిళ సినీ నిర్మాతల సంఘం కార్యదర్శి రాధాకష్ణన్, ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్.కె.సెల్వమణి, తమిళనాడు చిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడు ఆర్.వి.ఉదయకుమార్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆర్.కె.సెల్వమణి మాట్లాడుతూ, 'లాక్డౌన్ కారణంగా అన్ని రకాల సినీ కార్యకలాపాలు ఆగిపోయాయి. కుటుంబ పోషణ భారంగా ఉన్నందున సినీ కార్మికులకు కరోనా సాయంగా రూ.2 వేలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశాం. అలాగే కరోనా నిబంధనలు, మార్గదర్శకాలకు లోబడి సినిమా, టీవీ చిత్రీకరణలు జరుపుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరాం. మా విన్నపాలను ముఖ్యమంత్రి స్టాలిన్ దష్టికి తీసుకెళ్ళి మంత్రి స్వామినాథన్ మంచి నిర్ణయం వెల్లడిస్తామని హామీ ఇచ్చారు' అని తెలిపారు.
30 మంది ప్రాణాలు కాపాడిన సోనూ బృందం
బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి (శ్రేయాస్ హాస్పిటల్)లో ఆక్సిజన్ లీక్‌ను సోనూ బృందం గుర్తించి, వెంటనే తగినంత సంఖ్యలో ఆక్సిజన్ సిలిండర్లను పంపింది. 30 మంది కోవిడ్ బాధితులకు సకాలంలో ఆక్సిజన్ అందడంతో ప్రాణాలు దక్కాయి.