Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'అన్యాయం అక్రమాలు దోపిడీలు దురంతాలు ఎన్నాళ్ళని ఎన్నేళ్ళని' నినదించిన కలమతనిది. 'మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం' పలికిన హృదయమతనిది. అతనే అభ్యుదయకవి, సినీగీతరచయిత అదృష్టదీపక్. గత కొద్దిరోజులుగా కరోనాతో బాధపడుతున్న ఆయన ఈరోజు కాకినాడలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
1950 జనవరి 18న తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంలో జన్మించిన అదృష్టదీపక్ చిన్ననాటినుంచే గొప్ప సృజనాత్మకశక్తి అలవరుచుకున్నారు. హేతువాది, వృత్తిరీత్యా చరిత్ర ఉపన్యాసకులు. అభ్యుదయ భావస్ప్రహతో రగిలే కవితలనెన్నో రాశారు. మహాకవి శ్రీశ్రీతో సాహచర్యం చేశారు. ఆధునిక తెలుగు కవిత్వరంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్న మహాకవి ఆయన. 'కోకిలమ్మపదాలు', 'అగ్ని', 'సమరశంఖం', 'ప్రాణం', 'దీపకరాగం' మొదలైన రచనలు చేశారు. అభ్యుదయరచయితల సంఘంలో, ప్రజానాట్యమండలిలో చురుకైన పాత్ర పోషించారు.
1980 లో 'యువతరం పిలిచింది' సినిమాలోని 'ఆశయాలపందిరిలో అనురాగం సందడిలో' అనే పాటతో గీతరచయితగా ప్రవేశించి దాదాపు 40 కి పైగా సినిమాపాటలు రాశారు. 'ఎర్రమల్లెలు', 'నేటిభారతం', 'ఎర్రోడు', 'నవోదయం', 'దేశంలో దొంగలు పడ్డారు', 'జైత్రయాత్ర' 'కంచుకాగడా, 'ఎర్రమందారం', 'దేవాలయం', 'మా ఆయన బంగారం' మొదలైన సినిమాల్లో ఆయన రాసిన పాటలు గొప్ప సంచలనాన్ని రేకెత్తించాయి. 'మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం', 'ఉదయించని ఉదయం కోసం ఎదఎదలో రగిలెను హోమం', 'జాగోరే జంబాయిరే', 'అక్షరాలీవేళ అగ్ని విరజిమ్మాలి' మొదలైనవి. పాటలన్ని విన్నప్పుడల్లా నరనరాన ఉత్తేజం ఉరకలేస్తుంది.
నేటిభారతంలోని పాటకు 1984లో మద్రాసు కళాసాగర్ అవార్డు, 2010లో తెలుగు యూనివర్సిటి వారి కీర్తి పురస్కారం మొదలైనవి. లెక్కలేనన్ని పురస్కారాలు, గౌరవ సత్కారాలు అందుకున్నారు. తెలుగు సాహిత్యరంగానికి, సినీసాహిత్య లోకానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమైనవని కొనియాడుతూ ప్రముఖ సాహితీవేత్తలు ఆయనకు నివాళులు అర్పించారు.
- తిరునగరి శరత్ చంద్ర
6309 873 682