Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా మహమ్మారి వల్ల తెలుగు చిత్ర సీమ మరో దిగ్గజాన్ని కోల్పోయింది. ప్రముఖ అభ్యుదయ కవి, గేయ రచయిత అదృష్టదీపక్ (70) కరోనా కారణంగా కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం కోవిడ్ పాజిటివ్ రావడంతో కాకినాడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. కవిగా, కథకుడిగా, బుర్ర కథా రచయితగా, వ్యాసకర్తగా, భాషావేత్తగా, కాలమిస్టుగా, విమర్శకుడిగా, ఉపన్యాసకుడిగా, నటుడిగా, గాయకుడిగా, సినీ గేయ రచయితగా.. ఇలా అన్ని రంగాల్లోనూ తనదైన ముద్రతో పాఠకులు, ప్రేక్షకుల మదిపై చెరగని ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి అదృష్ట దీపక్. ఆయన రాసినవి కొన్ని పాటలే అయినప్పటికీ కొండంత కీర్తిని తీసుకొచ్చాయి. నాలుగు పదులు కూడా దాటని ఆయన పాటలన్ని ఆణిముత్యాలుగా నిలిచాయి.
రాజీపడని కలం యోధుడు..
'ఆశయాల పందిరిలో..', 'మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం.', 'నేడే... మేడే' వంటి తదితర పాటల్లో బడుగు, బలహీన వర్గాల బాధల్ని, గాధల్ని మనసు పొరల్ని స్పృశించేలా రాశారు. చెప్పదల్చుకున్న అంశాన్ని సూటిగా, సుత్తి లేకుండా కుండ బద్ధలు కొట్టినట్టు చెప్పడంలో అదృష్ట దీపక్ ఆయనకు ఆయనే సాటి. అందుకే ఆయన్ని ఎర్రజెండాయే నా ఎజెండా.. అంటూ అసమ సమాజం మీద అక్షర యుద్ధం ప్రకటించిన రాజీలేని కలం యోధుడిగా అభివర్ణిస్తారు.
ఏడేళ్ళ వయసులో గాయకుడిగా, తొమ్మిదేళ్ళ వయస్సులో నటుడిగా, పన్నెండేళ్ళ వయసులో రచయితగా కళా జీవితాన్ని ఆరంభించిన అదృష్ట దీపక్ తూర్పుగోదావరి జిల్లాలోని రావులపాలెంలో (1950) జన్మించారు.
మెప్పించిన బహుముఖ ప్రజ్ఞాశాలి
వామపక్ష భావజాలంతో నిండిన కుటుంబం నుంచి వచ్చిన అదష్టదీపక్ విద్యార్థి దశ నుంచి చేసిన కషి ఫలితంగా వీరి కవితలు, పాటలు, కథలు, వ్యాసాలు, సాహిత్య విమర్శలు ఆంధ్రదేశంలోని ప్రముఖ పత్రికలన్నీ ప్రచురించాయి. విశాలాంధ్ర, స్వాతి, వికాసం, మొదలగు పత్రికలూ, సంస్థలూ నిర్వహించిన పోటీలలో ఉత్తమ కవిగానూ, ఉత్తమ కథారచయితగానూ బహుమతులు పొందారు. శ్రీశ్రీ, ఆత్రేయ స్ఫూర్తితో కోకిలమ్మ పదాలు (1972), అగ్ని (1974), సమర శంఖం (1977), ప్రాణం (1978), అడవి (2008), దీపకరాగం (2008), ఆశయాల పందిరిలో (2010), శ్రీశ్రీ ఒక తీరని దాహం (2010) వంటివన్ని ఆయన కలం నుంచి జాలువారినవే. ఇందులో ముఖ్యంగా సినిమాల్లో ఆయన రాసిన పాటలన్నింటిని ఒక దగ్గర చేర్చే ప్రయత్నాన్ని 'ఆశయాల పందిరిలో..' పుస్తకంతో చేశారు. వీటితోపాటు అనేక ప్రసిద్ధ సంకలనాలలో వీరి రచనలు చోటుచేసుకున్నాయి. బెర్ట్రోల్డ్ బ్రెV్ా్ట, పాబ్లో నెరూడాల కొన్ని కవితలను తెలుగులోకి అనువదించారు. ఎన్నో నాటక కళాపరిషత్తులలో ఉత్తమ నటుడు, ఉత్తమ హాస్యనటుడు, ఉత్తమ క్యారెక్టర్ నటుడి అవార్డులు పొందారు. చరిత్రను భోదించే అధ్యాపకుడిగానూ 2003లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక అవార్డు (2003)ని సొంతం చేసుకున్నారు. అభ్యుదయ కవిగా, గేయ రచయితగా, నటుడిగా.. అందర్నీ మెప్పించిన బహుముఖ ప్రజ్ఞాశాలి అదృష్ట దీపక్.
'యువతరం కదిలింది'తో సినీ రంగ ప్రవేశం..
1980లో మాదాల రంగారావు 'యువతరం కదిలింది' చిత్రంలో 'ఆశయాల పందిరిలో..' గీతరచనతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత 'విప్లవశంఖం', 'నవోదయం', 'నేటిభారతం', 'దేశంలో దొంగలుపడ్డారు', 'ప్రజాస్వామ్యం', 'నవభారతం', 'భారతనారి', 'ఎర్రమందారం', 'అన్న', 'మా ఆయన బంగారం', 'దేవాలయం', 'వందేమాతరం',. 'అర్ధరాత్రి స్వతంత్రం', 'కంచుకాగడా', 'జైత్రయాత్ర', 'స్వరాజ్యం', 'బదిలీ', 'సగటుమనిషి', 'నవయుగం', 'నేను సైతం' వంటి తదితర విజయవంతమైన చిత్రాల్లో గీతరచన చేశారు. మాదాల రంగారావు, టి.కృష్ణ సినిమాలకు ఎక్కువగా పాటలు రాశారు. 'మానవత్వం..పరిమళించే' (నేటిభారతం) పాటకు ఉత్తమ గేయ రచయితగా 'కళాసాగర్' అవార్డు అందుకున్నారు.