Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తనతోపాటు కూతురి అనారోగ్యం, ఆర్థిక సమస్యలు.. వెరసి రంగస్థల నటి, హాస్యనటి, సహాయనటి పావలా శ్యామల జీవితాన్ని దుర్భరం చేశాయి. తన మార్క్ కామెడీతో ఎన్నో సినిమాల్లో ప్రేక్షకుల్ని నవ్వించిన పావలా శ్యామలకు పూట గడవటం కూడా చాలా కష్టంగా ఉందని నటి కరాటే కళ్యాణి సోషల్ మీడియా వేదికగా తెలిపారు. పావలా శ్యామల పరిస్థితి తెలుసుకున్న ఆమె రూ.10వేల సాయం చేశారు. తనలాగే అందరూ పావలా శ్యామలను అన్ని విధాలుగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. గతంలో చిరంజీవి, పవన్కళ్యాణ్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున పావలా శ్యామలకు ఆర్థిక సాయం అందినప్పటికీ ప్రస్తుతం ఆమె దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు. ఆపద సమయంలో ఆదుకోవాల్సిన ఫించన్ కూడా ఆమెకు రాకపోవడం మరింత బాధాకరం.'ఛాలెంజ్', 'స్వర్ణకమలం', 'సుస్వాగతం', 'మనసంతా నువ్వే', 'ఖడ్గం', 'నిన్నే ఇష్టపడ్డాను', 'వర్షం', 'ఆంధ్రావాలా', 'నువ్వొస్తానంటే నేనొద్దాంటానా', 'గోలీమార్' వంటి తదితర చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన పావలా శ్యామల అనారోగ్య కారణంగా వెండితెరకు దూరమయ్యారు. హైదరాబాద్లోని ఎస్.ఆర్.నగర్ బీకేగూడలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. దురదష్టశాత్తు ఆమె కూతురు కూడా మంచనా పడ్డారు. గతంలో టీబీతో బాధ పడి కోలుకుంటున్న సమయంలోనే ఓ కాలికి ఫ్యాక్చర్ కావడంతో 18 నెలలుగా ఆమె మంచానికే పరిమితమయ్యారు. తాను అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూతురికి అన్ని పనులు చేసి పెడుతున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఇబ్బందులతో నలిగిపోతున్నారు. సినీ పరిశ్రమ నుంచి, దాతల నుంచి సాయం కోరుతున్నారు. 'చాలాకాలంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మూడు నెలలుగా ఇంటి అద్దె కట్టలేదు. డబ్బులేక ఈ మధ్య ఐదు రోజులు పస్తులున్నాం. ఆకలితో నా బిడ్డను మంచం మీద వదిలేసి, నా ప్రాణం పోతుందేమోనని భయపడుతున్నా. వేషాల కోసం తిరిగినప్పుడు ఆకలి నొప్పి తెలిసినా, ప్రస్తుతం అనుభవిస్తున్న బాధ, నొప్పితో భయపడాల్సి వస్తోంది. చుట్టు పక్కల వాళ్ళు, అభిమానులు జాలి పడి 100, 150, 200, 500 రూపాయలు సాయం చేయడంతో పూట గడుస్తోంది. నాకు, కూతురికి కలిపి మందులకే నెలకు రూ.10 వేలు అవుతున్నాయి. ఇప్పుడు నేనే ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. దిక్కు తోచడం లేదు. అవార్డులు అమ్మి ఇల్లు గడుపుతున్నా. ప్రతి నెల వచ్చే ఫించన్ కూడా రావడం లేదు. కరోనా వల్ల ఎవరూ ఏ సాయం చేయడానికి ముందుకు రావడం లేదు' అని పావలా శ్యామలా తన దీనస్థితి గురించి తెలియజేస్తూ కన్నీటి పర్యంతమయ్యారు.