Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా సెకండ్ వేవ్ ధాటికి బాలీవుడ్ సైతం తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. థియేటర్లు ఇప్పటికే మూతపడ్డాయి. దీంతో సినిమాలను థియేటర్లలో రిలీజ్ చేసే పరిస్థితి కనిపించకపోవడంతో మేకర్స్ ఓటీటీ బాట పడుతున్నారు. స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ నటించిన 'రాధే' సినిమా ఓటీటీలో రిలీజై కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. కథ, కథనం ప్రేక్షకులకు తలనొప్పి తెప్పించేలా ఉన్నప్పటికీ వసూళ్ళ పరంగా రికార్డ్‌ని క్రియేట్ చేసింది. తొలి రోజు ఏకంగా వంద కోట్ల రూపాయల్ని కలెక్ట్ చేసి అందర్నీ సర్ప్రైజ్ చేసింది.
'రాధే' ఇచ్చిన ధైర్యంతో మిగిలిన మేకర్స్ తమ సినిమాలను ఓటీటీల్లో రిలీజ్ చేసేందుకు వేగంగా అడుగులు వేస్తున్నారు.
విద్యాబాలన్.. షేర్నీ
వైవిధ్యమైన సినిమాలు, పాత్రలకు పక్కా కేరాఫ్ విద్యాబాలన్. స్టార్ హీరోల సినిమాల కోసం ఎదురు చూసినట్టే విద్యా సినిమాల కోసం యావత్ దేశం ఎదురు చూస్తోందంటే అతిశయోక్తి లేదు.
ఓ పక్క కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే మరో కథాబలం ఉన్న సినిమాల్లో శక్తివంతమైన పాత్రలను పోషిస్తున్నారు. తాజాగా ఆమె ఓ పవర్ఫుల్ అటవీశాఖ అధికారిణిగా నటించిన చిత్రం 'షేర్నీ'. అమిత్ మసుర్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదల కానుంది.
అమెజాన్ ప్రైమ్‌లో జూన్ నుంచి స్ట్రీమింగ్ కానుంది. టీ-సిరీస్, అబుందాంటియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా విడుదలకు సంబంధించిన వార్తను అమెజాన్ సంస్థ సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులతో పంచుకుంది.
'తన మార్కు వేసేందుకు షెర్నీ సిద్ధం. జూన్‌లో ఆమెను కలుసుకుందాం' అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. శరద్ సక్సేనా, ముకుల్ చద్ధా, విజరు రాజ్, అరుణ్, బ్రిజేంద్ర కాలా, నీరజ్ కబి కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో మనిషి-జంతు సంఘర్షణ ప్రపంచంలో సమతుల్యతను తెచ్చేందుకు పోరాడే ఓ నిజాయితీ గల అటవీశాఖ అధికారిణిగా విద్యాబాలన్ మరోమారు తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నారు.
రకుల్.. సర్దార్ కా గ్రాండ్సన్
అలాగే రకుల్ ప్రీత్ సింగ్ నటించిన 'సర్దార్ కా గ్రాండ్సన్' చిత్రం కూడా నేరుగా ఓటీటీలోనే విడుదల కాబోతోంది. సమయపాలన, క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే రాధ పాత్రలో రకుల్ నటించింది. కాష్వీనాయర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నేటి (మంగళవారం) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తన బామ్మ మాటను నిలబెట్టేందుకు సర్దార్ మనవడు ఏం చేశాడన్నది ఈ సినిమా కథ. అర్జున్ కపూర్, రకుల్ జంటగా నటించారు.
'ఈ సినిమాలో పోషించిన పాత్ర నా జీవితానికి ఎంతో దగ్గరగా ఉంటుంది. నాన్న ఆర్మీకి చెందినవారు కావడంతో నా లైఫ్‌లోనూ సమయపాలన, క్రమశిక్షణ ఓ భాగమైపోయాయి. మేకర్స్ ఈ కథ చెప్పినప్పుడు వెంటనే అంగీకరించడానికి కారణం కూడా ఇదే. ఆద్యంతం భావోద్వేగ భరితంగా సాగే ఈ సినిమా అందర్నీ కచ్చితంగా అలరిస్తుంది' అని రకుల్ తెలిపింది.