Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నందిత శ్వేత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'జెట్టి'. ఈ సినిమాతో కష్ణ హీరోగా పరిచయం అవుతున్నారు. వర్ధిన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుబ్రహ్మణ్యం పిచ్చుకను దర్శకుడిగా పరిచయం చేస్తూ వేణుమాధవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సౌత్ ఇండియాలో తొలి హార్బర్ బ్యాక్డ్రాప్లో రూపొందిన ఈ సినిమా టైటిల్ లోగోను తెలుగు, తమిళం, మళయాళం, కన్నడ భాషల్లో చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు సుబ్రహ్మణ్యం పిచ్చుక మాట్లాడుతూ, 'ఈ కథ మనుషుల జీవితాల్లోంచి పుట్టింది. ప్రపంచం ఎంత మారినా కొన్ని జీవితాలు అనాదిగా వస్తున్న ఆచారాలను నమ్ముకుని జీవనం సాగిస్తున్నాయి. అలాంటి ఒక ఊరిలో జరిగిన కథ ఇది. ఇప్పటి వరకూ దక్షణ భారతదేశంలో నిర్మించని కథ ఇది. కొన్ని వందల గ్రామాలు, వేల మత్స్యకార కుటుంబాలు, కొన్ని తరాల పోరాటం, వారి కల ఒక గోడ, ఆ గోడ పేరే జెట్టి. ఈ అంశాన్ని ప్రధానాంశంగా తీసుకుని తెరకెక్కిస్తున్నాం. అలాగే బయట ప్రపంచానికి చాలా తక్కువగా తెలిసిన అరుదైన జాతి, సముద్రాన్ని నమ్ముకుని, కడలికి కన్నబిడ్డల్లాగా జీవిస్తున్న మత్స్యకారుల జీవన శైలిని, వారి కఠినమైన కట్టుబాట్లని, వారి సమస్యల్ని చూపిస్తూ రూపొందించిన చిత్రమిది. ఈ సినిమాలో సిద్ శ్రీరామ్ పాడిన పాట హైలెట్గా నిలుస్తుంది. త్వరలోనే ఈ పాటను విడుదల చేస్తాం. తెలుగుతో పాటు కన్నడ, తమిళ, మలయాళంలో రిలీజ్ చేస్తున్నాం. చిత్రీకరణ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాం' అని చెప్పారు. నందిత శ్వేత, కష్ణ, కన్నడ కిషోర్, మైమ్ గోపి, ఎమ్.యస్.చౌదరి, శివాజీరాజా, జీవా, సుమన్ శెట్టి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ : కార్తిక్ కొండకండ్ల, డిఓపి: వీరమణి, ఆర్ట్ :ఉపేంద్ర రెడ్డి, ఎడిటర్: శ్రీనివాస్ తోట, స్టంట్స్: దేవరాజ్ నునె, కొరియోగ్రాఫర్ : అనీష్, డైలాగ్స్ : శశిధర్, నిర్మాత : వేణు మాధవ్, కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : సుబ్రహ్మణ్యం పిచ్చుక.-