Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా మహమ్మారి కారణంగా అద్భుతాలను క్రియేట్ చేసిన సినీ దిగ్గజాలు ఒక్కొక్కరిగా మృత్యువాత పడుతున్నారు.
ప్రముఖ దర్శక, నిర్మాత యు. విశ్వేశ్వరరావు మరణ విషాదాన్ని దిగమింగుకోకముందే తెలుగు సినీ పరిశ్రమ మరో సినీ దిగ్గజాన్ని కోల్పోవడం బాధాకరం.
పలు భాషా అగ్ర హీరోల సినిమాలకు తన అద్భుతమైన ఫొటోగ్రఫీని అందించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ వి.జయరాం (70) కన్నుమూశారు. కరోనా పాజిటివ్ కారణంగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆయన గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. పదమూడేళ్ళ వయసులో ఇంటి నుంచి వెళ్లిపోయిన జయరాం తెలుగు, మలయాళ చిత్ర పరిశ్రమల్లో అద్భుత సినిమాటోగ్రాఫర్‌గా ఎదిగిన వైనం
నేటి తరానికి స్ఫూర్తిదాయకం. ఇటు తెలుగుతోపాటు అటు మలయాళ చిత్ర పరిశ్రమలోనూ ఛాయాగ్రాహకుడిగా జయరాం ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. తెలుగులో నందమూరి తారక రామారావు, కష్ణ, అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి, మోహన్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాలకు, మలయాళంలో మమ్ముట్టి, మోహన్‌లాల్, సురేష్‌గోపి వంటి అగ్ర హీరోల సినిమాలకూ ఆయన సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసి, తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన అనేక సినిమాలకు జయరాం సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. వీరి కాంబినేషన్లో రూపొందిన 'పెళ్లి సందడి' చిత్రం విశేష ప్రేక్షకాదరణతో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
సినిమాటోగ్రాఫర్‌గా జయరాం మొదటి సినిమాకి సి.వి. రాజేంద్రన్ దర్శకుడు. ఇందులో హీరో చిరంజీవి. సినిమా పేరు కూడా చిరంజీవే. 'శ్రీ షిర్డీ సాయిబాబా మహాత్మ్యం' సినిమా సినిమాటోగ్రాఫర్‌గా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. వాసు దర్వకత్వంలో రూపొందిన ఈ సినిమా చిత్రీకరణను వారం రోజుల్లో పూర్తిచేయడం విశేషం. ప్రముఖ మలయాళ దర్శకుడు ఐవీ శశి '1921' సినిమాకి మమ్ముట్టి హీరో, సినిమాటోగ్రాఫర్ జయరాం. ఇది పీరియాడికల్ సినిమా. జయరాంకు అవార్డును సంపాదించి పెట్టిన చిత్రమిది. నటి సౌందర్య ఆఖరి చిత్రం 'శివశంకర్'కు కూడా ఆయన పనిచేశారు.
ఎన్టీఆర్‌ను చూడాలన్న మోజుతో సినిమా రంగంలో అడుగుపెట్టి ఆయన నటించిన 'మంచికి మరోపేరు', 'డ్రైవర్ రాముడు', 'వేటగాడు', 'సింహబలుడు...' ఇలా ఎన్నో సినిమాలకు పనిచేశారు. ఎన్టీఆర్ నటించిన ఆఖరి చిత్రం 'మేజర్ చంద్రకాంత్'కు జయరామే సినిమాటోగ్రాఫర్. మోహన్‌బాబు సొంత బ్యానర్లో నిర్మించిన ఎన్నో చిత్రాలకూ జయరాం సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. అలాంటి లెజండరీ సినిమాటోగ్రాఫర్ మరణం చలనచిత్ర రంగానికి తీరని లోటు అని పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.