Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'బాహుబలి', 'రేసుగుర్రం', 'మళ్లీ రావా', 'దువ్వాడ జగన్నాథం', 'నా పేరు సూర్య..' వంటి ఎన్నో సూపర్‌హిట్ చిత్రాల్లో బాల నటుడిగా సాత్విక్ వర్మ ప్రేక్షకుల్ని మెప్పించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు బాలనటుడిగా అలరించిన ఆయన హీరోగా 'బ్యాచ్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఆకాంక్ష మూవీ మేకర్స్ పతాకం పై బేబీ ఆరాధ్య సమర్పణలో రమేష్ ఘనమజ్జి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాత్విక్ వర్మ, నేహా పఠాన్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు శివ. రఘుకుంచే సంగీత సారధ్యం వహిస్తున్న మ్యూజికల్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ఇది. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోందీ చిత్రం.
ఈ సందర్భంగా దర్శకుడు శివ మాట్లాడుతూ, 'యూత్‌కి కావాల్సిన అన్ని అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంగా కాలేజీ బ్యాక్ డ్రాప్లో సాగే కొంతమంది పోకిరి కుర్రాళ్ల కథే ఈ సినిమా. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, త్వరలోనే విడుదల చేస్తాం' అని చెప్పారు.
'దర్శకుడు శివ చెప్పిన కథ బాగా నచ్చింది. మా చిత్రంతో బాల నటుడు సాత్విక్ వర్మని హీరోగా పరిచయం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం జనవరిలో చిత్రీకరణ మొదలు పెట్టి హైదరాబాద్, విశాఖపట్నం, కాకినాడ వంటి తదితర పరిసర ప్రాంతాల్లో 59 రోజుల్లో పూర్తి చేశాం. మా సినిమాకి సంగీత దర్శకుడు రఘు కుంచే మరో హీరో. సాత్విక్ వర్మ, రఘు కుంచే కాంబినేషన్లో వచ్చే పాటలు అద్భుతంగా వచ్చాయి' అని నిర్మాత రమేష్ ఘనమజ్జి అన్నారు.
సాత్విక్ వర్మ, నేహా పఠాన్, బాహుబలి ప్రభాకర్, సంధ్యా జనక్, మిర్చి మాధవి, వినోద్ కుమార్, చిన్న తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా : వెంకట్ మన్నం, సంగీతం : రఘు కుంచే, కొరియోగ్రఫీ : రాజ్ పైడి, ఎడిటింగ్ : జె పి,
కో ప్రొడ్యూసర్ : సత్తి బాబు కసిరెడ్డి, అప్పారావు పంచాది, నిర్మాత : రమేష్ ఘనమజ్జి, దర్శకత్వం: శివ.