Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా మహమ్మారి కారణంగా సినీ పరిశ్రమకి చెందిన 24 శాఖల్లోని కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లాక్డౌన్ కారణంగా షూటింగ్‌లు కూడా లేకపోవడంతో నిత్యావసరాల సాయం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఇటువంటి తరుణంలో నటుడు అలీ ఆయన సతీమణి జుబేదా తమవంతు సాయం చేసేందుకు ముందుకొచ్చారు.
ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని తెలుగు సినీ ఉమెన్ ప్రొడక్షన్ యూనియన్‌కు సంబంధించిన 130 మందికి నిత్యావసరాలను అందించారు. పదికిలోల బియ్యం, నూనె, గోధుమపిండి, చక్కెరలతో పాటు 8 రకాలైన సరుకులను వారికి అందించారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ,'ప్రతిరోజూ షూటింగ్ లొకేషన్లకు మాకంటే ముందే ఈ ప్రొడక్షన్ యూనియన్‌లోని ఆడవాళ్లు వెళ్తారు. స్పాట్లో పనిచేసే అందరు తిన్న ప్లేట్లను, కాఫీ కప్పులను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉంటారు. ఈ కష్ట సమయంలో షూటింగ్‌లు లేక ఎంత ఇబ్బంది పడుతున్నారో నాకు తెలిసింది. అందుకే దాదాపు 2లక్షల రూపాయల ఖర్చుతో నిత్యావసరాలను అందజేశాను' అని అలీ చెప్పారు. ఈ కార్యక్రమంలో నటుడు ఖయ్యూం, కరీమ్‌లు కూడా పాల్గొన్నారు.