Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'చిత్ర పరిశ్రమలో జయాపజయాలు కామన్. అయితే చేసే పని మీద గౌరవం ఉండి, లక్ష్యం దిశగా అడుగులు వేస్తే పేరుతోపాటు డబ్బు కూడా వస్తుంది' అని అంటున్నారు నిర్మాత, నటి మిత్రశర్మ.
సినిమా నిర్మాణం కత్తిమీద సాములాంటిది. డబ్బులు, సత్తా ఉన్న హేమాహేమీలు సైతం సినీ నిర్మాణంలోకి అడుగుపెట్టడానికి సాహసం చేయరు. అలాంటిది చేతిలో రూపాయి లేకుండా ముంబయి నుంచి హైదరాబాద్‌కు వచ్చిన మిత్ర శర్మ నటిగా ఎన్నో ఒడిదుడుకుల ఎదుర్కొన్నారు. పడి లేచిన కెరటానికి ప్రతీకగా నిలిచి, సినిమాలపై మక్కువతో నిర్మాతగానూ మారారు. ఆమె నిర్మాతగా నిర్మించిన చిత్రం 'బార్సు'. నేడు (సోమవారం) మిత్రశర్మ పుట్టినరోజు. ఈ సందర్భంగా 'బార్సు' సినిమాతోపాటు తన కెరీర్‌కి సంబంధించిన విశేషాలను మీడియాతో షేర్ చేసుకున్నారు.
'ముంబయిలో పుట్టి పెరిగినప్పటికీ తెలుగు అనర్గళంగా మాట్లాడతాను. చిన్నప్పట్నుంచి సినిమాలంటే ఇష్టం. సన్నిహితులు ఇచ్చిన సలహాతో ముంబయి నుంచి హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యాను. ఇక్కడకు వచ్చిన తరువాత అవకాశాల కోసం అనేక సినిమా ఆఫీసులు చుట్టూ తిరిగాను. సరైన ఆఫర్ల కోసం ప్రయత్నం చేసే కంటే నేనే నలుగురికి అవకాశం ఇచ్చి, వారిలో ఉన్న ప్రతిభను బయటపెట్టుకునే అవకాశాన్ని కల్పిద్దామనుకున్నా. అందుకే శ్రీ పిక్చర్స్ అనే సినీ నిర్మాణ సంస్థను స్థాపించి, నూతన తారాగణంతో 'బార్సు' చిత్రాన్ని నిర్మించా. ఈ సినిమాలో హీరోయిన్గా నటించాను. యూత్‌ఫుల్ కాలేజ్ లవ్, కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. రాహుల్ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలోని సిప్లీగంజ్ పాడిన 'హేరాజా..' అనే పాట యూట్యూబ్‌లో మిలియన్ వ్యూస్‌కి పైగా దక్కించుకుని, సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. వినూత్నమైన ప్రయత్నాల్ని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. ఆ నమ్మకంతోనే కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయిని ఖర్చుపెట్టి ఈ చిత్రాన్ని నిర్మించాను' అని మిత్రశర్మ తెలిపారు.